
లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
పంజగుట్ట(హైదరాబాద్): ‘టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నా.. రూ.కోట్లు పార్టీ అభివృద్ధికి ఖర్చు చేశా.. కానీ ఇప్పటివరకు ఏ నాయకుడు నన్ను గుర్తించలేదు.. ఏ పదవీ ఇయ్యలేదు.. వెంటనే నాకు ఏదో ఓ పదవి ఇవ్వాలి’అని కోరుతూ టీఆర్‌ఎస్ నాయకుడు ఒకరు సోమవారం ప్రగతిభవన్ ముందు ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకుని అతన్ని స్టేషన్‌కు తరలించారు.
పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా నాగపురం గ్రామానికి చెందిన లక్ష్మణ్ ముదిరాజ్ 2001 నుంచి టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్నారు. పార్టీ అభివృద్ధి కోసం రూ.కోట్లు ఖర్చు చేసినట్లు లక్ష్మణ్ తెలిపారు. కానీ, పార్టీ నుంచి తనకు ఎలాంటి లబ్ధి చేకూరకపోగా ప్రస్తుతం నిరుద్యోగిగా మిగిలిపోయానని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో సోమవారం మధ్యాహ్నం 12:15గం.కు ప్రగతిభవన్ ముందుకు వచ్చి తన వెంట తెచ్చుకున్న డీజిల్ ఒంటిపై పోసుకున్నారు.
అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు గుర్తించి వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించి సాయంత్రం వరకు దీక్ష చేయడంతో పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి విడుదల చేశారు.