టీఆర్‌ఎస్ ప్రస్తుతం 60 లక్షల మందికి పైగా సభ్యులతో అన్ని స్థాయిల్లో పటిష్టంగా ఉంది. ఈ పరిస్థితిని అనువుగా మార్చుకుని, పార్టీకి కొత్త రక్తం ఎక్కించే ప్రక్రియను కేసీఆర్ చాప కింద నీరులా కొనసాగిస్తున్నారని నేతలు చెప్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పాతతరం నేతల స్థానంలో కొత్తవారు, యువతకు అవకాశాలు ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నారని తెలిపాయి. అధికారంలో ఉండటం ద్వారా తలెత్తే ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడం.. కొత్త రాజకీయ శక్తులు, విపక్షాల దూకుడుకు కళ్లెం వేయడం లక్ష్యంగా సీఎం కేసీఆర్ వ్యూహాలు పన్ను తున్నారని.. అందులో భాగంగానే కొత్తవారు, యువతపై దృష్టిపెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సాక్షి, హైదరాబాద్: ‘‘పార్టీలో ఉన్న యువతే భవిష్యత్తు నిర్మాతలు. నియోజకవర్గ స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా నాయకులు ఎక్కడి నుంచో రారు. ఇక్కడి నుంచే పుట్టుకొస్తారు. కొత్త నాయకత్వంతో మరింత వేగంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ముందటి నాగలి తర్వాత వెనుక నాగలి వచ్చినట్టు లైన్‌లో ఉన్న వారికి ఆటోమేటిగ్గా అవకాశాలు వస్తాయి..’’ హుజూరాబాద్ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలివి. పార్టీలో, పదవుల్లో యువతకు, కొత్తవారికి అవకాశాలు కల్పించే దిశగా ముందుకు సాగు తున్నట్టు ఆయన ఇచ్చిన సంకేతాలివి. సీఎం కేసీఆర్ ఇప్పటికే కొంతకాలంగా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. టీఆర్‌ఎస్ రెండోసారి గెలిచాక కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించిన ఆయన.. మెల్లగా యువతకు ప్రాధాన్యంపై దృష్టిపెట్టారు. కొత్తవారికి చాన్స్‌లు ఇస్తున్నారు.
ఎవరి సామర్థ్యం ఏమిటో చూస్తూ..
వాస్తవానికి రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచీ రాజకీయ పునరేకీకరణపైనే కేసీఆర్ ఎక్కువగా దృష్టిపెట్టారని.. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లోకి వలసలు దాదాపు క్లై్లమాక్స్‌కు చేరాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీకి దీర్ఘకాలంగా సేవచేస్తున్నవారు, వివిధ సందర్భాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు, యువ నాయకుల పనితీరును అంచనా వేసే పనిని కేసీఆర్ మొదలుపెట్టారని చెప్తున్నాయి. అవకాశమున్న ప్రతీచోటా సామాజిక సమీకరణాలు చూసుకుంటూ కొత్త రక్తాన్ని ఎక్కించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొంటున్నాయి. పాత, కొత్త అనే తేడా లేకుండా.. యువ నాయకుల పనితీరు, వారి బలాలు, బలహీనతలను మదింపు చేసి, పార్టీ అవసరాల ఆధారంగా పదవులకు ఎంపిక చేయడమనే వ్యూహాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ వర్గాలు వివరిస్తున్నాయి. దీనికి రాబోయే రోజుల్లో మరింత పదును పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారని చెప్తున్నాయి.
రాష్ట్ర రాజకీయాల్లోకి వారసుల ఎంట్రీ!
ప్రస్తుతం శాసనసభలో టీఆర్‌ఎస్‌కు 103 మంది సభ్యుల బలం ఉంది. అందులో సుమారు 60 మంది ఎమ్మెల్యేలు తొలిసారి, రెండోసారి గెలిచినవారే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరో 25 మంది వరకు కొత్తతరం నాయకులు టీఆర్‌ఎస్ ద్వారా రాజకీయం అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని... కొందరు సీనియర్ నేతలు తమ వారసులను తెరమీదకు తేనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు నేతల వారసులు ఇప్పటికే యువసేనలు, ట్రస్ట్‌లు, సేవా కార్యక్రమాల పేరిట నియోజకవర్గాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పోచారం భాస్కర్‌రెడ్డి, జోగు ప్రేమేందర్, బాజిరెడ్డి జగన్, పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, కోనేరు వంశీకృష్ణ, నడిపెల్లి విజిత్‌రావు, కడియం కావ్య, డీఎస్ రవిచంద్ర, అజ్మీరా ప్రహ్లాద్, బస్వరాజు శ్రీమాన్, పుట్ట శైలజ, వనమా రాఘవ, చిట్టెం సుచరిత, మైనంపల్లి రోహిత్, ఏ.సందీప్‌రెడ్డి వంటివారు చురుగ్గా ఉన్నారు. కొందరు ఇప్పటికే జిల్లాస్థాయిలో వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరిలో కొందరికైనా భవిష్యత్తులో అవకాశం వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరికొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ వారసత్వం లేని కొత్తతరం నాయకులు ముందుకు వస్తున్నారు.
అన్నివర్గాల వారికి అవకాశం దిశగా..
రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న టీఆర్‌ఎస్‌లో కొత్తవారికి, పలుకుబడి కలిగిన వారు, ఉద్యమంలో పనిచేసినవారు, ప్రముఖులు, రాజకీయ వారసత్వం కలిగిన వారు తదితర కేటగిరీల్లో అవకాశాలు వస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాతకు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో నోముల నర్సింహయ్య కుమారుడు భగత్, పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవికి కేసీఆర్ అవకాశం కల్పించారు. తాజాగా గవర్నర్ కోటాలో పాడి కౌశిక్‌రెడ్డిని నామినేట్ చేయగా, ఇంతకుముందు ఇదే కోటాలో కవి, గాయకుడు గోరటి వెంకన్న, సామాజిక సేవా రంగానికి చెందిన భోగారపు దయానంద్‌కు అవకాశం లభించింది. ఇక ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా హుజూరాబాద్‌కు చెందిన బండా శ్రీనివాస్‌ను నామినేట్ చేశారు. ప్రభుత్వ విప్‌లుగా బాల్క సుమన్, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, గొంగిడి సునీత వంటి కొత్తతరం నేతలకు అవకాశం ఇచ్చారు. అసెంబ్లీ కమిటీల్లోనూ కొత్తవారికే చోటు కల్పించారు. యాదవ, పద్మశాలి, రజక, విశ్వ బ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ వంటి సామాజిక వర్గాలకు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.
అవకాశాల వేటలో విద్యార్థి నేతలు
ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా పనిచేసిన కొందరు విద్యార్థి నేతలు టీఆర్‌ఎస్ ద్వారా రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బాల్క సుమన్, గ్యాదరి కిశోర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, వాసుదేవరెడ్డి, బొంతు రామ్మోహన్, బాబా ఫసియుద్దీన్, పిడమర్తి రవి, రాకేశ్‌రెడ్డి, ఆంజనేయులుగౌడ్ వంటి వారికి వివిధ రూపాల్లో రాజకీయ అవకాశాలు లభించాయి. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ను టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేసి సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక దూదిమెట్ల బాలరాజు యాదవ్, రాజారామ్ యాదవ్, పల్లా ప్రవీణ్‌రెడ్డి వంటి ఉద్యమ నేపథ్యమున్న విద్యార్థి నేతలు.. పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పటికైనా తమకు రాజకీయ అవకాశం కల్పిస్తారనే ఆశతో ఉన్నారు.
TRS: కొత్త రూట్‌లో ‘కారు’
Published Sat, Aug 14 2021 1:55 AM | Last Updated on Sat, Aug 14 2021 3:58 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment