సాక్షి, చెన్నై: తన పేరిట పార్టీ అంటూ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ వ్యవహరించిన తీరుతో సందిగ్ధంలో పడ్డ దళపతి విజయ్ తర్వాత కార్యాచరణపై దృష్టి పెట్టారు. అభిమానసంఘం నేతల్ని చెన్నైకు పిలిపించి భేటీ అయ్యారు. పనయూర్ ఫామ్ హౌస్‌లో సాగిన ఈ భేటీలో కీలక నిర్ణయాల్ని తీసుకున్నారు. నటుడు విజయ్ పేరిట రాజకీయపార్టీని ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో తండ్రి తనయుడి మధ్య అంతరం పెరిగినట్టు పరిస్థితుల్లో చోటుచేసుకున్నాయి. తన తీరును చంద్రశేఖర్ సమర్థించుకుంటున్నారు. తాను చేసిన పనిని ఇప్పుడు వ్యతిరేకించినా, భవిష్యత్తులో విజయ్‌కు ఇది బలంగా నిలవడం ఖాయమని మీడియాతో చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తండ్రి నిర్ణయాన్ని ఖండించడమే కాదు, తన పేరును, ఫొటోను వాడుకుంటే చట్టపరంగా చర్యలు తప్పవన్న హెచ్చరించిన విజయ్ తర్వాత కార్యాచరణపై దృష్టి పెట్టారు. (వివాదంగా మారిన విజయ్ తండ్రి పార్టీ)
అభిమానసంఘం నేతలతో భేటీ..
విజయ్ అభిమాన సంఘం నేతలు ఇదివరకు ఎస్‌ఏ చంద్రశేఖర్‌తో ఎక్కువగా టచ్‌లో ఉండేవారు. విజయ్ మక్కల్ ఇయక్కం ఏర్పాటుతో పాటు తనయుడి వ్యవహారాలన్నీ చంద్రశేఖర్ పర్యవేక్షిస్తుండడంతో ఎక్కువ మంది అభిమాన సంఘం నేతలు దళపతి తండ్రితోనే సన్నిహితంగా మెలిగేవారు. ఈ దృష్ట్యా, ఎక్కడ పార్టీ వ్యవహారాల్లో అభిమాన సంఘం నేతలు జోక్యం చేసుకుంటారో ఏమోనన్న బెంగ విజయ్‌లో బయలుదేరినట్టుంది. దీంతో తన అభిమాన సంఘ ముఖ్యనేతలు యాభై మందిని చెన్నైకు పిలిపించారు. మంగళవారం ఉదయాన్నే చెన్నైకు చేరుకున్న ఈ అభిమాన నేతలు పనయూరులోని విజయ్ ఫామ్ హౌస్‌కు వెళ్లారు. అక్కడ కొన్ని గంటల పాటు భేటీ సాగింది. తన తండ్రి వ్యవహరించిన తీరుపై విజయ్ తీవ్ర మనోవేదనలో ఉన్నట్టు సమాచారం.
రాజకీయాలు అవసరమాని విజయ్ ప్రశ్నించగా మెజారిటీ శాతం మంది రాజకీయాల్లో అడుగుపెడదామని చెప్పినట్టు తెలిసింది. అయితే, విజయ్ ఏమాత్రం చిక్కకుండా రాజకీయాలకు దూరం అన్నట్టుగానే అభిమాననేతలకు ఉపదేశం చేశారు. తండ్రి చంద్రశేఖర్‌కు దూరంగా ఉండాలన్న సూచనను అభిమాన నేతలకు చేసినట్టు చర్చ. సమావేశంలో మరికొన్ని అంశాలపై సుదీర్ఘ చర్చ సాగినట్టు, ఆ మేరకు విజయ్ నుంచి కీలక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో వెలువడే అవకాశాలు ఉన్నట్టుగా అభిమానులు పేర్కొంటున్నారు. ఈ దృష్ట్యా, ఆ ప్రకటన కోసం ఎదురుచూపులు, ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయో అనే ప్రాధాన్యత అభిమానుల్లో పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment