సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీకి బరు వైన హృదయంతో రాజీనామా చేస్తున్నట్టు, పార్టీలో ఉన్నప్పుడు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డికి రాజీనామా లేఖ పంపించారు. బుధవారం నోవాటెల్ హోటల్‌లో వివేక్, ఆయన కుమారుడు వంశీకృష్ణకు కండువా కప్పి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్టీలోకి ఆహ్వానించారు.
అంతకుముందు ఉదయం తన కుటుంబసభ్యులతో హోటల్‌కు చేరుకున్న వివేక్.. రాహుల్‌గాం«దీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఆయన వెంట ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నారు. కాంగ్రెస్‌లో చేరాలంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆహ్వానించడంతో అందుకు అంగీకారం తెలిపినట్లు వివేక్ చెప్పారు. కాగా పలు దఫాలుగా వివేక్‌తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.
సీఎల్పినేత భట్టి విక్రమార్క చర్చలు జరిపిన దరిమిలా ఈ కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. వివేక్‌కు, ఆయన కుమారుడు వంశీకృష్టకు కాంగ్రెస్ పార్టీ ఒక అసెంబ్లీ టికెట్, ఒక లోక్‌సభ సీటు కేటాయించను న్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి వివేక్ నిలబడే అవకాశముందని, పెద్దపల్లి లోక్‌సభ స్థానాన్ని ఆయన కుమారుడికి కేటాయించే విషయంపై అంగీకారం కుదిరిందని కాంగ్రెస్ వర్గాల సమాచారం.
కేసీఆర్ కుటుంబపాలన అంతం చేయాలనే లక్ష్యంతోనే చేరా: వివేక్ వెంకటస్వామి
తెలంగాణలో కేసీఆర్ కుటుంబపాలన, బీఆర్‌ఎస్ రాక్షస పాలన అంతం చేయాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వివేక్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాక ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కేసీఆర్‌ను తప్పక గద్దె దించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తెలంగాణ సాధనలో అప్పటి ఎంపీల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు.ఎన్నికల్లో పోటీ, టికెట్ కేటాయింపు వంటివి అంత ముఖ్యమైనవి కాదన్నారు. తన రాజకీయ భవిష్యత్, చేపట్టే కార్యాచరణను కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయిస్తుందని వివేక్ చెప్పారు.
వివేక్ చేరిక బలాన్నిస్తుంది: రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే ప్రజల ఆకాంక్షకు వివేక్ చేరిక బలాన్నిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు తెలంగాణ కోసం పోరాడిన ఎంపీల బృందం తిరిగి కాంగ్రెస్‌లో చేరడం శుభసూచకమన్నారు. తెలంగాణలో అధికారమార్పిడి జరగబోతోందని చెప్పారు. శంషాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ను గద్దె దింపే శక్తి కాంగ్రెస్‌కు ఉందని వివేక్ విశ్వసిస్తున్నారని తెలిపారు.
‘గాంధీ కుటుంబంతో వివేక్ కు ఎంతో అనుబంధం ఉంది. వివేక్ తో రాహుల్ గాంధీ ఫోన్ లో మాట్లాడి కాంగ్రెస్ లో చేరాలని కోరారు. వివేక్ తిరిగి కాంగ్రెస్ లో చేరడమంటే ఆయన సొంత కుటుంబంలో చేరినట్లే. ఆయన్ను కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నా. వారి చేరిక కాంగ్రెస్‌కు వెయ్యేనుగుల బలాన్ని చేకూర్చింది’అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment