చెన్నై: అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని క్యాబినెట్ నుంచి తప్పిస్తూ గవర్నర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. కొన్ని గంటల్లోనే ఆర్.ఎన్. రవి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచన మేరకు తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. ఇంతకూ అమిత్ షా ఏం చెప్పారు? ఎందుకు సెంథిల్ బాలీజీ విషయంలో గవర్నర్ ఆర్.ఎన్.రవి వెనక్కి తగ్గారు?
క్యాష్ ఫర్ జాబ్స్, మనీల్యాండరింగ్ లాంటి తీవ్రమైన అవినీతి ఆరోపణల కేసుల నేపథ్యంలో క్యాబినెట్ నుంచి మంత్రి సెంథిల్‌ను తొలగిస్తున్నట్లు గవర్నర్ ఆర్.ఎన్.రవి నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం గవర్నర్ తన విచక్షణ అధికారం ఉపయోగించినట్లు రాజ్‌భవన్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. ఈ నిర్ణయంపై డీఎంకే ప్రభుత్వం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచన మేరకు అర్ధరాత్రి సమయంలో అటార్నీ జనరల్‌తో భేటీ అయిన గవర్నర్ ఆర్‌ఎన్ రవి.. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నిలుపుదల చేసినట్లు ప్రకటన విడుదల చేశారు. దీంతో బాలాజీ ప్రస్తుతానికి మంత్రిగానే కొనసాగనున్నారు. గవర్నర్ ఆర్.ఎన్.రవి నిర్ణయం న్యాయ పరంగా చిక్కుల్ని తెచ్చి పెట్టే అవకాశం ఉందనే అనుమానంతోనే అటార్ని జనరల్ సూచన తీసుకోమని అమిత్ షా సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు బుధవారం బాలాజీ జ్యూడీషియల్ కస్టడీని జులై 12వ తేదీ వరకు పొడిగించింది స్థానిక కోర్టు. మనీల్యాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఆయన్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన చేతిలో ఉన్న శాఖలను ఇది వరకే మరో ఇద్దరు మంత్రులకు సీఎం స్టాలిన్ అందజేయగా.. మంత్రిత్వ శాఖ మంత్రిగా ప్రస్తుతం సెంథిల్ కొనసాగుతుండడం గమనార్హం.
ఇదీ చదవండి: అర్ధరాత్రి తమిళనాట హైడ్రామా.. మంత్రి డిస్మిస్‌పై వెనక్కి తగ్గిన గవర్నర్!
Comments
Please login to add a commentAdd a comment