సిద్దిపేట నియోజకవర్గం
టిఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సిద్దిపేటలో ఘన విజయం సాదించారు. ఆయన మూడు ఉప ఎన్నికలు, మూడు సాదారణ ఎన్నికలలో గెలిచారు. మూడు ఉప ఎన్నికలలో గెలవడం ఒక రికార్డు. గతంలో కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖరరడ్డి క్యాబినెట్‌లో ఒక ఏడాది పాటు మంత్రిగా ఉన్నారు. 2014లో తెలంగాణ ఏర్పడి టిఆర్‌ఎస్ అదికారంలోకి వచ్చాక కెసిఆర్ క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. కాని 2018లో గెలిచిన వెంటనే మంత్రి కాలేకపోయారు. కొన్ని నెలల తర్వాత మంత్రి పదవి చేపట్టగలిగారు.
2018లో హరీష్‌రావుకు సిద్దిపేటలో 118699 ఓట్ల రికార్డు మెజార్టీ వచ్చింది. ఆయన తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్ ఐ నేత శ్రీనివాసరెడ్డిపై విజయం సాదించారు. హరీష్ రావుకు 131295 ఓట్లు రాగా శ్రీనివాసరెడ్డికి కేవలం 12596 ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్ గల్లంతు అయింది. కాగా ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన నాయిని నరోత్తం రెడ్డికి నాలుగువేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. హరీష్‌రావు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు స్వయానా మేనల్లుడు. వెలమ సామాజికవర్గానికి చెందినవారు.
1985 నుంచి 2004 వరకు ఈ నియోజకవర్గానికి కెసిఆర్ ప్రాతినిద్యం వహించగా, ఆ తర్వాత హరీష్ రావు ఇక్కడ నుంచి గెలుస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఇంతవరకు పన్నెండుసార్లు ఇక్కడ గెలిచినట్లు లెక్క. కాగా, ఇక్కడ ఆరుసార్లు గెలిచిన కెసిఆర్ గజ్వేల్ నుంచి రెండుసార్లు గెలిచి తెలంగాణలోనే అత్యదికంగా ఎనిమిది సార్లు గెలిచిన నేతగా నమోదయ్యారు. కాగా కెసిఆర్ నాయకత్వంతో హరీష్‌రావు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించారు. టిఆర్‌ఎస్ నేతలు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌లతో పాటు హరీష్‌రావు కూడా రెండుమార్లు తెలంగాణ సాదనలో భాగంగా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి, ఉప ఎన్నికలలో విజయం సాధించారు.
రెండువేల నాలుగులో పార్టీ అదినేత కెసిఆర్ లోక్ సభకు కూడా ఎన్నికై సిద్దిపేట సీటుకు రాజీనామా చేశారు. దరిమిలా జరిగిన ఉప ఎన్నిక ద్వారా హరీష్ రావు శాసనసభలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి తిరుగులేని ఆదిక్యతతో గెలుస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 15 సార్లు వెలమ సామాజికవర్గం నేతలు గెలుపొందారు. నాలుగుసార్లు బిసి మున్నూరు కాపు నేతలు, ఒకసారి రెడ్డి, మరోసారి బ్రాహ్మణ వర్గం నేత విజయం సాధించారు.
కెసిఆర్‌కు ముందు మరో తెలంగాణ వాద నేత మదన్‌మోహన్ కూడా సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు గెలిచారు. 1970లో జరిగిన ఉప ఎన్నికలో మదన్‌మోహన్ తెలంగాణ ప్రజాసమితి పక్షాన ఇండి పెండెంటుగా పోటీచేసి గెలిచారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్‌లో కలిసిపోయారు. మదన్‌మోహన్ అప్పట్లో పి.వి.నరసింహారావు, చెన్నారెడ్డి, అంజయ్య, భవనం, కోట్ల క్యాబినెట్‌లలో మంత్రిగా పని చేసారు. 1967లో ఇక్కడ గెలిచిన వి.బి.రాజు 1952లో సికింద్రాబాద్, 1957లో అసిఫ్‌నగర్ నుంచి ఎన్నికయ్యారు. కెసిఆర్ శాసనసభలో అత్యధిక సార్లు గెలిచిన నేతగా రికార్డు సృష్టించడమే కాకుండా, 2004 నుంచి2009 వరకు కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి మూడుసార్లు గెలిచిన ఘనత కెసిఆర్‌కి దక్కింది.
ఆ తర్వాత మహబూబ్ నగర్‌లో ఒకసారి, మెదక్‌లో మరోసారి మొత్తం ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఒకే టరమ్‌లో రెండుసార్లు రాజీనామా చేసి గెలిచిన రికార్డు కూడా కేసిఆర్ సొంతం. కెసిఆర్ కుమారుడు తారకరామారావు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నుంచి గెలుపొంది ఆయన క్యాబినెట్‌లో మంత్రి కాగా, కెసిఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ నుంచి 2014లో ఎమ్.పి అయ్యారు. ఒక కుటుంబం నుంచి ముగ్గురు పదవులలో ఉన్న ఘనత వీరికి దక్కింది.అయితే 2019 లోక్ సభ ఎన్నికలలో కవిత ఓటమి చెందడం విశేషం. ఆ తర్వాత కవిత శాసనమండలి సభ్యురాలు అయ్యారు.
సిద్దిపేట నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment