Why Chandrababu Naidu Not Talk To Media After Meeting With Amit Shah And JP Nadda - Sakshi
Sakshi News home page

ఆ భేటీ తర్వాత చంద్రబాబు అందుకే మాట్లాడకుండా వెళ్లిపోయారా?

Published Wed, Jun 7 2023 1:31 PM | Last Updated on Wed, Jun 7 2023 3:09 PM

Why Chandrababu Not Talk To Media After Meeting Amit Shah And Nadda - Sakshi

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిసిన తర్వాత మీడియాతో ఎందుకు మాట్లాడలేదు!చంద్రబాబు ఎప్పుడైనా ఇలా మీడియాతో మాట్లాడకుండా  వెళ్లిపోయారా?. తదుపరి పార్టీ నేతలతో పొత్తుల గురించి మాట్లాడవద్దని చంద్రబాబు అన్నారంటే ఏమిటి దాని అర్దం? పని జరగలేదనా?. అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు భేటీ అవడం సహజంగానే రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. గత నాలుగేళ్లుగా బీజేపీ పెద్దలను కలవాలన్న ప్రయత్నం ఇప్పటికి సఫలం అయినందుకు చంద్రబాబు టీమ్‌లో ఆనందం తాండవించి ఉండవచ్చు. కానీ, అది తాత్కాలికమే అన్న వార్తలు వస్తున్నాయి. అవి నిజమే అయితే టీడీపీ రెండు విధాల చెడినట్లు అనుకోవచ్చు.

✍ తిట్టిన వారు.. ఇప్పుడు తెగ పొగిడేస్తున్నారు..
ప్రధాని నరేంద్ర మోదీని, హోం మంత్రి అమిత్ షాను బండబూతులు తిట్టిన టీడీపీ వారు, ఇప్పుడు తెగ పొగిడేస్తున్నారు. చంద్రబాబుకు  ఆత్మగౌరవం అన్నది సమస్య కాదు. అవసరమైతే అధికారం వస్తుందనుకుంటే ఆయన ఎంతకైనా దిగజారతారన్న విమర్శలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు మాట మార్చేయగలరు. కాని ఇప్పుడు పరీక్ష బీజేపీ వారికే. మోదీకి 2019లో చంద్రబాబు నల్లబెలూన్లు చూపి నిరసన చెప్పారు. కనీసం విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం చెప్పలేదు. మోదీని దేశద్రోహిగా, దేశాన్ని నాశనం చేసిన వ్యక్తిగా చంద్రబాబు ప్రచారం చేసి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో రాజకీయ స్నేహం చేశారు. అయినా తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం దక్కకపోవడంతో వారిని గాలికి వదలివేశారు.

✍ అది నిజమే అయితే..
మళ్లీ మోదీ, అమిత్ షాల వైపు చూడడం ఆరంభించారు. చకోరపక్షులు మాదిరి ఎదురుచూస్తూ ఉన్నారు. ఎలాగైతేనేం అమిత్ షా అప్పాయింట్ మెంట్ దొరికింది. దాంతో ఎగిరి గంతేసినంత పనిచేశారు. బీజేపీ తెలంగాణ ఎంపీ లక్ష్మణ్ మధ్యవర్తిత్వంతో ఈ భేటీ జరిగిందని చెబుతున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు బీజేపీకి పనిచేస్తాయని చెప్పడానికి వెళ్లారని కధనాలు వచ్చాయి. అది నిజమే అయితే బిజెపి తన గోయి తాను తవ్వుకున్నట్లే అవ్వవచ్చు. ఎందుకంటే గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తీరును పరిశీలిస్తే , టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ దారుణంగా దెబ్బతింది.

✍ టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా?
అంతకుముందు ఎన్నికలలో 21 సీట్లు వస్తే , 2018లో అవి 19 కి పడిపోయాయి. అంతేకాక చంద్రబాబుతో కలిసి పరువు పోగొట్టుకుంది. తదుపరి చంద్రబాబు యధాప్రకారం కాంగ్రెస్ ను నట్టేట వదలివేశారు.ఎపి ఎన్నికలలో కాంగ్రెస్ ఊసే ఎత్తలేదు. బిజెపి ఇన్ చార్జీ సునీల్ ధియోధర్ అన్నట్లు కాంగ్రెస్ తో పొత్తును తెగతెంపులు చేసుకున్నామని చంద్రబాబు ఇంతవరకు ప్రకటించలేదు. అయినా బిజెపి పెద్దలు టిడిపితో పొత్తు పెట్టుకుంటారా? దానివల్ల ప్రయోజనం ఉంటుందా? అన్నది చర్చగా ఉంది. ముఖ్యమంత్రి జగన్ డిల్లీలో మోడీని, అమిత్ షా ను కలిస్తే చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు కేసుల గురించి వెళ్లారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటారు. ఆయనకు మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి,టివి 5 వంటివైతే ఆ గదులలో నక్కి కూర్చుని సమాచారం సేకరించిన చందంగా ఊహాగానాలు ఇచ్చేవి.  కాని చంద్రబాబు కలిస్తే మాత్రం బిజెపి స్నేహ హస్తం అంటూ అందంగా చిత్రించారు.
చదవండి: బాబు ముంచేశాడు.. ‘కోడెల’ మరణం వెనుక అసలు సీక్రెట్‌ ఇదేనా?

✍​​​​​​​ అలా ఎందుకు రాయలేదు?
చంద్రబాబు పిఎస్ వద్ద పట్టుబడ్డ 2 వేల కోట్ల ఐటి స్కామ్ ముందుకు వెళ్లకుండా జాగ్రత్తపడి ఉండవచ్చని రాయలేదు. ఎపి ప్రభుత్వం అమ రావతి భూముల విషయంలోను, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లోను చంద్రబాబుపై కేసులు పెట్టినందున, వాటిపై తదుపరి చర్య లేకుండా ఉండడానికి అమిత్ షాను కాకాపట్టడానికి వెళ్లారని రాయలేదు. ఈనాడు అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి ఆర్దిక అవకతవకల కేసులో సాయం చేయడానికి చంద్రబాబు వెళ్లి ఉండవచ్చని ఈ పత్రికలు రాయలేదు. చంద్రబాబు కోసమే అమిత్ షా ఎదురు చూశారన్నంత చందంగా కధనాలు ఇచ్చాయి.

అయితే ఏపీలో జగన్ ప్రభుత్వానికి కేంద్రం సహకరిస్తున్న తీరుపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారని కొన్ని మీడియాలలో వార్తలు వచ్చాయి. అదన్నమాట. ఏపీపై చంద్రబాబుకు ఉన్న ప్రేమ. ఇక తెలంగాణలో ఎన్నికల కోసం చంద్రబాబుతో మాట్లాడి ఉంటారా?. అంటే ఏమైనా కావచ్చు. కర్నాటక ఎన్నికల తర్వాత బీజేపీకి దక్షిణాదిలో ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఒకవేళ టీడీపీ మద్దతు ఇస్తే కొంత ఉపయోగం ఉంటుందేమోనని బిజెపి నేతలు కొంతమంది ఎవరైనా  భావించారేమో తెలియదు. కాని తెలంగాణలో టిడిపి ఇప్పటికే దాదాపు అడుగంటింది. ఏదో నామమాత్రంగా నడుపుతున్నారు.

✍​​​​​​​ నమ్మించే యత్నం..
ఇలాంటి బేరసారాలు చేయడానికి వీలుగా కాసాని జ్ఞానేశ్వర్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారీ, చిన్న రాజకీయ వేత్తను అధ్యక్షుడుగా పెట్టుకుని కథ నడుపుతున్నారు. టీడీపీతో పాటు జనసేన కూడా కలిస్తే తెలంగాణలో కొంత ప్రభావం ఉండవచ్చని చంద్రబాబు నమ్మించే యత్నంచేసి ఉండవచ్చు. అయినా సర్వేలు చేయించుకోకుండా అమిత్ షా దీనిపై ముందుకు వెళతారా? బీజేపీలో తెలుగుదేశం వ్యక్తులను ప్రవేశపెట్టిన చంద్రబాబు వారి ద్వారా నాలుగేళ్లపాటు సాగించిన రాయబారాలకు బీజేపీ పెద్దలు సంప్రదింపులకు సిద్దం అయి ఉండాలి. తెలంగాణలో మద్దతు ఇస్తే ఏపీలో జగన్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఉండాలని, ఆ ప్రభుత్వానికి సహకరించరాదని చంద్రబాబు కండిషన్ పెట్టే అవకాశం ఉంటుంది.

✍​​​​​​​ చంద్రబాబుకు మైండ్ బ్లాక్..
కేంద్రం ఇటీవల పదివేల కోట్ల ఆర్ధిక సాయం ఇచ్చిన తీరుకు చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయిఉండాలి. అలాగైతే జగన్‌కు ఏపీలో తిరుగు ఉండదని ఆయన భయపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు కూడా అలాగే నిధులు ఇస్తే రాజకీయంగా తమకు నష్టం అని చంద్రబాబు భావిస్తుండవచ్చు. ఎపిలో బిజెపికి పెద్దగా బలం లేదు. అయినా వారి మద్దతు కోసం ఎందుకు పాకులాడుతున్నారంటే కారణం ఇదే. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎపిలో జగన్ ప్రభుత్వాన్ని ఎదో విధంగా ఇబ్బంది పెట్టాలంటే వారితో పొత్తులోకి వెళ్లడమే మార్గమని టిడిపి భావిస్తోంది. జగన్ ఎప్పుడూ కేంద్రంలోని బిజెపిపై నోరుపారేసుకోలేదు.

✍​​​​​​​ వ్యూహాత్మక తప్పిదమా?
అవసరమైన సందర్భాలలో మద్దతు ఇస్తున్నారు. అందువల్ల జగన్ తో పొత్తు లేకపోయినా, ఆయనను ఇబ్బంది పెట్టవలసిన అవసరం బిజెపికి ఉండదు. కాకపోతే బిజెపిలోని తెలుగుదేశం నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం బిజెపి అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. బిజెపికి పది లోక్ సభ సీట్లు ఇస్తామని టిడిపి ఆఫర్ ఇస్తోందని ప్రచారం జరుగుతోంది. అది నిజమో కాదో తెలియదు. ఏది ఏమైనా అమిత్ షాను వ్యక్తిగత అవసరాల కోసం కలిశారా? రాజకీయ ప్రయోజనాల కోసం కలిశారా? అన్నదానిపై వారు వివరణ ఇవ్వవలసి ఉంటుంది. సాధారణంగా ఒక రాజకీయనేతను కలవడం తప్పు కాదు. కాని తమను అవమానించిన చంద్రబాబు వంటి నేతతో మళ్లీ పొత్తు పెట్టుకోవడానికి బిజెపి ఆలోచన చేస్తుంటే మాత్రం అది వ్యూహాత్మక తప్పిదమే కావచ్చు.

✍​​​​​​​ అది శరాఘాతమే..
మోదీని, అమిత్ షా లను తీవ్రంగా చంద్రబాబుకాని, ఆయన పార్టీ నేతలు కాని దూషించినప్పుడు బాధపడ్డ అభిమానులకు మాత్రం అది శరాఘాతమే అవుతుంది. టిడిపిని కుటుంబ పార్టీ అని, అవినీతి పార్టీ అని నిన్నటిదాక ఒరిజినల్ బిజెపి నేతలు విమర్శిస్తుండేవారు. నిజంగానే బీజేపీ కనుక టీడీపీతో స్నేహం కోసం అర్రులు చాస్తే అలాంటివారికి ఎంతో చిన్నతనం అవుతుంది.  అన్నిటికి మించి మోదీ, అమిత్ షా లు కూడా తమ ఆత్మ గౌరవాన్ని రాజకీయం కోసం వదలివేసుకుంటారా? అన్న ప్రశ్న వస్తుంది.

✍​​​​​​​ కొసమెరుపు ఏమిటంటే..
ఈ చర్చ జరుగుతున్న  తరుణంలోనే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ టిడిపితో పొత్తు ఊహాగానమేననితేల్చేశారు. తెలంగాణతో పాటు ఎపిలో కూడా పొత్తు ఆలోచన లేదన్నారు. దీంతో టిడిపి శ్రేణులు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా ఒక్కసారిగా డీలాపడ్డాయి. అంటే దీని అర్దం చంద్రబాబు తనపై, రామోజీ పైన ఉన్న కేసుల విషయంలో సాయం చేయాలని కోరడానికే వెళ్లినట్లయిందా! కొసమెరుపు ఏమిటంటే చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్‌లో మాట్లాడుతూ పొత్తులపై ఇప్పుడు ఎవరూ మాట్లాడవద్దని, ఎన్నికల సమయంలో చూద్దామని అన్నారట. అంటే అర్ధం అయింది కదా! అమిత్ షా వద్దకు వెళ్లినా రాజకీయంగా పెద్ద ప్రయోజనం లేకపోయిఉండవచ్చు. మరి కేసులలో అయినా ఏమైనా హామీ లభించి ఉంటుందా!అన్నది చెప్పలేం. తెలంగాణలో బిఆర్ఎస్ కు ఈనాడు బాకా ఊదుతోందన్న భావన బిజెపిలో ఉందని అంటున్నారు. ఈ నేపద్యంలో బిజెపి వద్దకు వెళ్లి చంద్రబాబు మరో సారి విశ్వసనీయత కోల్పోతే, పని జరగక పరువు పొగొట్టుకుని రెండిందాల చెడ్డట్లు అయిందన్న అభిప్రాయం కలుగుతుంది.


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement