విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ సభ విజయవంతం అవడం సహజంగానే తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, జ్యోతి వంటి మీడియా సంస్థలకు జీర్ణం కాని విషయమే. ఈ సభకు సంబంధించి రెండు అంశాలను గమనించాలి. ఒకటి సీఎం వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల కోసం ఎజెండాను సెట్ చేస్తున్నారు. రెండు సభ జరిగిన తీరు, దానిని మీడియా కవర్ చేసిన వైనం. ముందుగా జగన్ స్పీచ్‌ను గమనిస్తే ఆయన తన సంక్షేమ కార్యక్రమాల ఆధారంగానే మాట్లాడారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీముల వల్ల అత్యధిక లబ్ధి పొందింది బీసీలేనని ఆయన తెలిపారు. నా బిసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ వర్గాలు అంటూ ఆయన ఉచ్చరించడం ద్వారా వారిని సొంతం చేసుకోవడానికి యత్నించారు. ఇప్పటికే ఆ వర్గాలలో మెజార్టీ తనవైపు ఉన్న నేపథ్యంలో ఆయన వారిని మరింత కన్సాలిడేట్ చేసుకోవడానికి ఈ వేదికను ఉపయోగించుకున్నారు. జయహో బీసీ పేరుతో జరిగిన ఈ సభలో బీసీ వర్గాలకు చెందిన సుమారు 80 వేల మంది వివిధ హోదాలలో ఉన్న ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
దీని ద్వారా బీసీ వర్గాలలో వైసీపీ ఎంత పట్టు సాధించింది పరోక్షంగా చెప్పారన్నమాట. బీసీ వర్గాల ఆదరణ మళ్లీ పొందడానికి గాను తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలకు ఇది ప్రతి వ్యూహం అనుకోవచ్చు. ఈ సందర్భంగా ఆయన పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్దం జరగబోతోందని, 18 నెలల్లో జరిగే ఈ యుద్దంలో అంతా తనకు మద్దతు ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేశారు. యుద్ధం అన్న పదం వినడానికి కొంత ఇబ్బందికరంగా ఉన్నా, రాజకీయంగా ఆయన దానిని అంత సీరియస్‌గా తీసుకున్నారని అర్ధం చేసుకోవచ్చు.
ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పన్నుతున్న వ్యూహాలను ఆయన తిప్పికొట్టడానికి, తన వాదనను ప్రజలలోకి తీసుకు వెళ్లడానికి బలంగా వినిపించారు. గతంలో ఏ సీఎం చెప్పని విధంగా తన పాలన వల్ల మేలు జరిగిందనుకుంటేనే తనకు ఓటు వేయాలని, అదే విషయం ప్రజల ఇళ్లకు కూడా తెలియచేయాలని ఆయన కోరారు. బీసీల సమాజానికి వెన్నుముక వంటి వారని, వారి కోసం తాను ఏఏ స్కీములను ప్రవేశపెట్టింది. వాటిని అడ్డుకోవడానికి టీడీపీ ప్రయత్నాలు ఏమి చేసింది.. మొదలైన విషయాలను ఆయన వివరించారు.
ఇక మీడియా కవరేజీ విషయానికి వస్తే ఈనాడు, జ్యోతి వంటి పత్రికలు పత్రికా ప్రమాణాలతో సంబంధం లేకుండా వార్తలు ఇస్తున్నాయి. అదే పద్దతిని ఇప్పుడు కూడా కొనసాగించాయి. ఈనాడు అయితే కనీసం ఒక వార్తకు అయినా ప్రాముఖ్యత ఇచ్చారు. జ్యోతి అయితే మొదటి పేజీలోనే తీవ్ర వ్యతిరేకతను కనబరుచుతూ కథనాలను ఇచ్చింది. కర్నూలులో ఒక ప్రధాన వీధిలో చంద్రబాబు సభ జరిగితే జనం ఫోటోలను ప్రచురించిన ఈనాడు.. జగన్ సభకు సంబంధించి వేదికను మాత్రమే ఫోటోగా ఇచ్చింది.
అక్కడితో ఆగకుండా.. ఈనాడు, జ్యోతి కూడబలుక్కుని రాసినట్లుగా జగన్ మాట్లాడుతుండగా వెళ్లిపోయారని ఎప్పటి మాదిరి రాశాయి. అయితే ఆంధ్రప్రభ తదితర కొన్ని పత్రికలు సభ విజయవంతం అయిందని, బీసీ ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారని ప్రముఖంగా ఇచ్చాయి. ఆంధ్రప్రభలో మొదటి పేజీలోనే సభ సక్సెస్ అన్న శీర్షికను కథనం ఇచ్చారు. టీడీపీతో పరోక్షంగానో, ప్రత్యక్షంగానో కలిసి ప్రయాణిస్తున్న సిపిఐకి చెందిన విశాలాంధ్ర మాత్రం బీసీ సభ వార్తను మొదటి పేజీలోనే వేయలేదు. చివరి పేజీకి పరిమితం అయింది. సిపిఎంకు చెందిన ప్రజాశక్తి బానర్‌గా కథనం ఇచ్చింది. ఆ సందర్భంగా భారీగా ట్రాపిక్ జామ్ అయిన విషయాన్ని ప్రస్తావించింది.
ఇక జ్యోతి పత్రిక జనం లేరని ఒక వార్త, సభ వల్ల మొత్తం నగరం అంతా నరకంగా మారిందని మరో వార్త రాసింది. నిజంగానే జనం పెద్దగా రాకపోతే నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది ఎందుకు వస్తుందన్న సంగతి మర్చిపోయింది. విశేషం ఏమిటంటే గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రద్దీగా ఉండే బెంజ్ సెంటర్ నడి రోడ్డులో నవనిర్మాణ దీక్షలని కార్యక్రమం నిర్వహించినప్పుడు అహా, ఓహో అంటూ వార్తలు ఇచ్చాయి.
నిజానికి అప్పుడు ఆ రోడ్డులో వచ్చిన జనమే తక్కువ. దాని కోసం ప్రజలను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది టీడీపీ మీడియా మర్చిపోయి ఉండవచ్చు. అంతేకాదు.. పోలవరం సందర్శన అని, లేని అమరావతి విజిట్ అని, ఇలా రకరకాల ప్రచార యాత్రలకు జనాన్ని ఆర్టీసీ బస్లలో తిప్పినందుకుగాను ఆర్టీసీ వారికి 78 కోట్ల మేర టీడీపీ చెల్లించనేలేదట.
చదవండి: ఆర్టీసీకి ‘చంద్రన్న భజన’ బకాయి రూ.78.36 కోట్లు
మరి వైసీపీ మాత్రం ఈ సభకు బస్‌ల ఏర్పాటు నిమిత్తం అయిన 3.8 కోట్ల రూపాయలను చెల్లించినట్లు వెల్లడైంది. అయినా ఈనాడు అసత్య కథనాలు రాసింది. ఏది ఏమైనా ప్రతి నిత్యం తెలుగుదేశం పార్టీతోనే కాకుండా, ఈనాడు, జ్యోతి వంటి టీడీపీ మీడియాతో యుద్దం జరుగుతూనే ఉంది. జగన్ చెప్పినట్లు ఎన్నికల యుద్దం కాదు.. ఇప్పటికే అది ఆరంభం అయిందని అనుకోవచ్చు. అందుకే జగన్ తన మద్దతుదారులను అప్రమత్తం చేస్తున్నారు.
-హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment