
సాక్షి, అమరావతి: మునిసిపల్, నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగించడం ఖాయమని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మనసున్న సీఎంగా వైఎస్ జగన్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థుల గెలుపునకు దోహదం చేశాయని చెప్పారు. ఆ విజయ పరంపర మునిసిపల్ ఎన్నికల్లోనూ కొనసాగుతుందన్నారు. ఆదివారం జరగబోయే విజయోత్సవాలను పురస్కరించుకుని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద భారీగా సంబరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో టీడీపీకి ప్రజలు పూర్తిగా చరమగీతం పాడినట్టేనని అన్నారు. మునిసిపల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే సంబరాల ఏర్పాట్లపై పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి వరకు సంబరాలు నిర్వహించాలని నిర్ణయించారు. కార్యకర్తల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సంబరాలకు హాజరయ్యే వారు విధిగా మాస్క్‌లు ధరించాలని సూచించారు. సమావేశంలో లేళ్ల అప్పిరెడ్డి, నేతలు ఎ.నారాయణమూర్తి, ఎన్.పద్మజ, న్యాయవాది రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.