సాక్షి, అమరావతి: తన ఫోన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన ఆరోపణలను వైఎస్సార్‌సీపీ నేతలు, ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. అవి పూర్తిగా అవాస్తవాలని చెప్పారు. ఆయన టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారని, అందుకే ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని వాస్తవాలను బట్టబయలు చేశారు. కోటంరెడ్డి వినిపిస్తున్న మాటలు ఎవరో రికార్డింగ్ చేసినవే తప్ప, ప్రభుత్వం ట్యాపింగ్ చేయలేదని స్పష్టంచేశారు.
ఎవరితోనో కోటంరెడ్డి మాట్లాడుతూ పరుషమైన వ్యాఖ్యలు చేస్తే.. వాటిని మరెవరో రికార్డు చేసి సర్క్యులేట్ చేస్తే.. దాన్నే కోటంరెడ్డికి శ్రేయోభిలాషిగా ఇంటెలిజెన్స్ చీఫ్ పంపి ఉండొచ్చని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎవరి ఫోన్‌లూ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. ఆయన బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధమయ్యాకే కోటంరెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
ఆయనకు వైఎస్ జగన్ సముచిత గౌరవం ఇచ్చారన్నారు. కోరుకున్న పదవులు రాలేదనే అసంతృప్తి ఉన్నట్లు కోటంరెడ్డే అన్నారని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని కోటంరెడ్డి మాట్లాడిన ఆడియో కూడా సర్క్యులేట్ అవుతోందని, దాన్ని కూడా ట్యాపింగ్ చేశారంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబుతో కలిసి కోటంరెడ్డి, ఆనం ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని తెలిపారు.
ఆ బురదలో వారే కొట్టుకుపోతారని చెప్పారు. చంద్రబాబు, రామోజీరావులతో ఎవరైనా మాట్లాడాలంటే వారి సహాయకులకే ఫోన్ చేస్తారని అన్నారు. అదే రీతిలో వైఎస్ వివేకా మరణించారనే సమాచారాన్ని ఇవ్వడానికి సీఎం వైఎస్ జగన్ ఇంట్లో పనిచేసే నవీన్‌కు వైఎస్ అవినాష్‌రెడ్డి ఫోన్ చేశారని, ఇందులో అసహజం ఏముందని ప్రశ్నించారు. దీన్ని పట్టుకుని చంద్రబాబు, ఎల్లో మీడియా బురదజల్లడం రాక్షసత్వమని మండిపడ్డారు. పరిపాలన వికేంద్రీకరణతోనే సమతుల అభివృద్ధి సాధ్యమని సీఎం వైఎస్ జగన్ ఆదిలోనే ఆయన విధానాన్ని ప్రకటించారన్నారు. అందులో భాగంగా మూడు రాజధానులను ప్రకటించారని తెలిపారు.
3 నెలల కిందటే ఎందుకు చెప్పలా? : మాజీ మంత్రి పేర్ని నాని
మూడు నెలలుగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంటే అప్పుడే ఎందుకు చెప్పలేదని, ఇప్పుడెందుకు చెబుతున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పేర్ని వెంకటరామయ్య(నాని) నిలదీశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ పెట్టకపోతే ఇంత మంది ఎమ్మెల్యేలు అయ్యేవారా? ఒక్కసారి కోటంరెడ్డి ఆత్మావలోకనం చేసుకోవాలన్నారు. చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి శ్రీధర్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ సామాన్లు కొనలేదని, ట్యాపింగ్ చేసే సదుపాయం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. శ్రీధర్‌రెడ్డిది అవకాశవాద రాజకీయమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కోటంరెడ్డిలాంటి వారు పోతే పార్టీకి దరిద్రం పోతుంది: కొడాలి నాని
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి లాంటి నాయకులు వెళ్లిపోతే వైఎస్సార్‌సీపీకి దరి ద్రం పోతుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరావు (నాని) అన్నారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. కోటంరెడ్డిని సీఎం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి ఉంటాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబే సీఎం అయ్యే పరిస్థితిలేదని, కోటంరెడ్డికి మంత్రి పదవి ఇచ్చేది ఎక్కడని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసే అలవాటు చంద్రబాబుదేనన్నారు. సీఎం జగన్ ఎవరినీ మభ్య పెట్టరని, ఉన్నది ఉన్నట్లు చెబుతారని తెలిపారు. ఈ పనికిమాలిన వారు ఏమి మాట్లాడుతారో వినే సమయం సీఎంకు ఉంటుందా అని ప్రశ్నించారు.
అది రికార్డింగ్ వాయిస్ : మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలు అర్థరహితమైనవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శ్రీధర్‌రెడ్డి పార్టీని వీడి వెళ్లిపోవడానికి ఏదో కారణం చూపించాలన్న ఉద్దేశంతోనే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఫోన్ టాపింగ్ అనేదే లేదని మంత్రి స్పష్టం చేశారు. రికార్డింగ్ మెసేజ్‌ను పట్టుకుని యాగీ చేయడం సరైన పద్ధతి కాదన్నారు.పోన్‌లో మాట్లాడింది ట్యాపింగా లేదా రికార్డింగా అనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా, కోర్టు ద్వారా దర్యాప్తు చేయించినా అభ్యంతరం లేదన్నారు.
ట్యాపింగ్ అని నిరూపిస్తే రాజకీయాలకు నేను దూరం: బాలినేని
సాక్షి ఒంగోలు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ నిరూపిస్తే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, నిరూపించలేకపోతే శ్రీధర్‌రెడ్డి రాజకీయాలకు దూరమవుతారా అని నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాల వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. అది ఫోన్ ట్యాపింగ్ కాదని, కోటంరెడ్డి పక్కన ఉండే స్నేహితుడే ఆయన కాల్‌ను రికార్డు చేసి పార్టీ అధిష్టానానికి పంపారన్నారు. అది తెలుసుకున్న ఇంటెలిజెన్స్ అధికారి సీతారామాంజనేయులు కోటంరెడ్డితో ఉన్న పరిచయాల కారణంగా దానిని ఫోన్‌లో వినిపించారని తెలిపారు.
దానిని పట్టుకుని ఫోన్ ట్యాపింగ్ అనడం అర్థరహితమని చెప్పారు. వారిద్దరి మధ్య ఉన్న చనువుతోనే ఇంటెలిజెన్స్ అధికారి శ్రీధర్‌రెడ్డిని అడిగారని, చివరకు ఆ స్నేహంపైనే మచ్చ వేయడం దారుణమని అన్నారు. కాల్ రికార్డు చేసిన వ్యక్తిని ప్రెస్‌మీట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమన్నారు. ఆయన స్నేహితుడు రామశివారెడ్డినే అడిగి తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు టిక్కెట్ ఇస్తానని చెప్పకపోతే 20 24లో టీడీపీ తరఫున పోటీచేస్తానని ఎలా ప్రకటిస్తారని అన్నారు. ఆనం రామనారాయణరెడ్డికి భద్రత తగ్గించలేదని తెలిపారు.
ఫోన్‌ట్యాపింగ్ రాజకీయ ఆరోపణ: మిథున్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనడం రాజకీయ ఆరోపణ అని వైఎస్సార్‌సీపీఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. రాజకీయ స్వార్ధంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment