సాక్షి, తాడేపల్లి: వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలను కాపాడటంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. తుపానుకు ముందు తీసుకోవాల్సిన చర్యల విషయంలో సర్కార్ ఘోర వైఫల్యం చెందిందని చెప్పారు. ఇదే సమయంలో ఇప్పటికైనా సహాయక చర్యల్లో వేగం పెంచి బాధితులను ఆదుకోవాలని సూచించారు.
కాగా, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘విజయవాడలోకి వరద వచ్చి ఎనిమిది రోజులు అయినా ప్రభుత్వంలో చలనం లేదు. కాలమే సమస్యకు పరిష్కారం చూపుతుందన్నట్టుగా ఉన్నారు. వర్షాలు, వరదల గురించి ముందే సమాచారం ఉన్నా పట్టించుకోలేదు. 28న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో వరదల గురించి కనీసంగా కూడా చర్చించలేదు. తుపానుకు ముందు తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఘోర వైఫల్యం చెందారు.
వరద వచ్చి లక్షన్నర మంది గ్రౌండ్ ఫ్లోర్‌లోని వారు మునిగిపోతే పట్టించుకోలేదు. ఎంతసేపూ వైఎస్ జగన్‌ను విమర్శించటమే తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు. ప్రజలకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోరంటూ సాక్షాత్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీనే అన్నారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా?. రెండు లక్షల మందిని తరలించలేకపోతే కనీసం అలర్ట్ చేస్తే వారే వెళ్లిపోయేవారు కదా?. అదికూడా చేయకుండా జనం చనిపోవడానికి కారణం అయ్యారు. పది రోజులుగా మురుగు నీరు నిల్వ ఉంటే పట్టించుకోవటం లేదు. పారిశుధ్యం దారుణంగా మారింది. సహాయక చర్యల్లో వేగం పెంచాలి.
ఇళ్ల దగ్గర జనం లేని సమయంలో నష్టం అంచనా వేయటం ఏంటి?. వ్యాపార సంస్థల నష్టాన్ని కూడా అంచనాలు వేయాలి. ఇళ్లలో నష్టపోయిన గృహోపకరణాలకు కూడా నష్ట పరిహారం అందించాలి. బుడమేరు వరద తప్పిదం వెనుక బాధ్యులెవరో చెప్పాలి. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇంత నష్టానికి కారకులెవరో తేల్చాలి. ప్రజలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. పేదలను కోటీశ్వరులను చేస్తామని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు పేదలు రోడ్డున పడ్డారు, కోటీశ్వరులు పేదలయ్యారు. 35వేల క్యూసెక్కుల నీటిని ఎవరికీ చెప్పకుండా ఎలా కిందకు వదిలారు?.
అధికారులంతా బందర్ రోడ్డులో, బీఆర్‌టీఎస్ రోడ్డులోనే కనపడుతున్నారు తప్ప వరద ప్రాంతాల్లో కనపడటం లేదు. బోట్లను వదిలి బ్యారేజిని కూల్చాలని ఆరోపణలు చేసే బదులు వాటిపై విచారణ చేయాలి. పర్మిషన్ లేని బోట్లు ఎవరి చేతుల్లో ఉన్నాయో కూడా విచారణ జరపాలి. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ప్రకటించాలి. వరద ముంపునకు కారకులెవరో కూడా వెంటనే తేల్చాలి. చిన్న ఉద్యోగి నుండి పెద్ద అధికారి వరకు ఉదాసీనంగా వ్యవహరించారు. అందుకే వరదలతో లక్షల మంది ఇక్కట్ల పాలయ్యారు’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment