సాక్షి, ఢిల్లీ: పోస్టల్ బ్యాలెట్‌పై సుప్రీంకోర్టులో వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటానికి దిగింది. ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసింది. అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్‌తో ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులను వైఎస్సార్‌సీపీ సవాల్ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలన్న వైఎస్సార్‌సీపీ.. పోస్టల్ బ్యాలెట్‌పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్ వేసింది. కేవలం ఏపీలోనే ఇలాంటి ఉత్తర్వులను ఇవ్వడాన్ని వైఎస్సార్‌సీపీ ప్రశ్నించింది.
కాగా, పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారమ్‌పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి.. పేరు, హోదా, సీల్ లేకపోయినా కూడా వాటిని ఆమోదించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్ సీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పరిష్కరించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో అభ్యంతరాలుంటే వాటిని ప్రస్తావించేందుకు ప్రత్యామ్నాయ వేదికలున్నాయని పేర్కొంది.
ఆ ప్రత్యామ్నాయ మార్గాలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివాదంపై ఎన్నికలు పూర్తయిన తరువాత ఎన్నికల పిటిషన్లు (ఈపీ) దాఖలు చేసుకోవాలని వైఎస్సార్ సీపీకి సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్‌ల ధర్మాసనం శనివారం తీర్పు వెలువరించింది. కేంద్రం ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను చట్ట విరుద్ధంగా ప్రకటించి వాటిని రద్దు చేయాలని అభ్యర్థిస్తూ వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ ఉత్తర్వుల అమలును నిలిపివేసి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఓ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం వాదనలు విన్న జస్టిస్ కిరణ్మయి ధర్మాసనం శనివారం తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదన్న కేంద్ర ఎన్నికల సంఘం వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా ఎన్నికల ఫలితాల కిందకే వస్తుందని, ఫలితాలపై అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేసుకోవాలే కానీ హైకోర్టును ఆశ్రయించరాదన్న వాదనను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల ఫలితాలను సవాల్ చేస్తూ ఈపీలు దాఖలు చేయడం ఆచరణ సాధ్యం కాదన్న వైఎస్సార్‌సీపీ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే వర్తించేలా ఈ ఆదేశాలు ఇచ్చిందని, ఇది అన్యాయమన్న వాదనను సైతం కోర్టు పరిగణలోకి తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment