
కమలాపూర్‌లో మాట్లాడుతున్న వైఎస్ షర్మిల
కమలాపూర్: సీఎం కేసీఆర్... బార్లు, బీర్లతో తాగుబోతుల తెలంగాణగా మార్చారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. గుడులు, బడుల కన్నా మద్యం షాపులే ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర శనివారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఉప్పల్, కమలాపూర్‌లో షర్మిల మాట్లాడారు.
నిరుద్యోగంలో, అత్యాచారాల విషయంలో తెలంగాణను నంబర్‌వన్‌గా మార్చారని ఆరోపించారు. వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది మన కేసీఆరేనని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు లేక ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ ఆడిందే ఆట, పాడిందే పాట అయ్యిందన్నారు.
ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నాయా అని ప్రశ్నించారు. కేసీఆర్ బయటకు వచ్చాడంటే ఓట్ల కోసమేనని, అతడిని నమ్మి మళ్లీ ఓట్లేస్తే మిమ్మల్ని మీ బిడ్డలే క్షమించరన్నారు. తెలంగాణలో మాట మీద నిలబడే నాయకుడే లేడని, ప్రజల కోసం కొట్లాడే పార్టీయే లేదని తెలిపారు. ప్రజాసేవకోసమే వైఎస్సార్‌టీపీని స్థాపించానని, మీరు ఆశీర్వదిస్తే తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగాల ఫైలు మీదే తొలి సంతకం చేస్తానని, బెల్టు షాపులు అసలే లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు.