సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోడు పట్టాలు అందిస్తానని ఆ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల అన్నారు. అదివాసీ వర్గీకరణకు తమ పార్టీ కృషి చేస్తుందని హామీనిచ్చారు. సోమవారం ఇక్కడి లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆదివాసీ ఆత్మీయ సమ్మేళనంలో షర్మిల మాట్లాడారు. జల్, జంగల్, జమీన్ కోసం గోండు నాయక్, కొమురం భీం మొదలుకొని నేటి దాకా ఆదివాసీలు పోరాడుతూనే ఉన్నారని, పదేళ్లుగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఆదివాసీలు, అటవీ అధికారుల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయన్నారు.
ఖమ్మం జిల్లాలో 21 మంది మహిళలపై కేసులు పెట్టి జైలులో హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2005 అటవీచట్టం ఎంతో అద్భుతమని చెప్పిన సీఎం కేసీఆర్.. ఆ చట్టాన్ని మాత్రం అమలు చేయడం లేదని మండిపడ్డారు. పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం గత ఏడేళ్లుగా గిరిజనులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. వైఎస్ హయంలో 3.30 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు.
ఆ తర్వాత ఏ ప్రభుత్వమూ బాధితులకు ఒక్క పట్టా ఇచ్చిన దాఖలాల్లేవని పేర్కొన్నారు. తెలంగాణలో కనీసం 11 లక్షల ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని గత పదేళ్లుగా పోరాటం చేస్తున్నారని చెప్పారు. పట్టాలు ఇవ్వకపోగా ఇచ్చిన వాటికి కూడా విలువలేదని, వాటికి కూడా హక్కులు కల్పించలేమని, పట్టాలు ఉన్నా కూడా రైతుబంధు, రైతు బీమా ఇవ్వలేమని చెప్పడాన్ని షర్మిల ఆక్షేపించారు. ‘మాట మీద నిలబడే వైఎస్‌ఆర్ బిడ్డగా చెబుతున్నాను, వైఎస్‌ఆర్ పోడు భూములకు పట్టాలు ఇచ్చినట్లుగానే తాము కూడా ఆదివాసీ గిరిజనులను గౌరవించి వారికి పట్టాలు అందజేస్తామని స్పష్టం చేశారు. ఆదివాసీ వర్గీకరణకు కృషి చేస్తాన్నారు.
Comments
Please login to add a commentAdd a comment