
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: యర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కేడర్‌లో పసలేకపోయినా సీటు విషయమై నాలుగు వర్గాలుగా నాయకులు విడిపోయారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత కుమ్ములాటలు పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనతో ఒక్కసారిగా బయటపడ్డాయి. పార్టీ అధిష్టానం ఆదేశించిన కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రథమ, ద్వితీయ శ్రేణి నాయకులు సైతం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు.శుక్రవారం యర్రగొండపాలెంలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వస్తుండటంతో ఆయన వద్దే అమీతుమీ తేల్చుకునేందుకు నేతలు సిద్ధమయ్యారు.
మన్నె రవీంద్ర x ఎరిక్షన్‌బాబు
యర్రగొండపాలెం నియోజకవర్గంలో నాలుగు వర్గాలుగా చీలిన టీడీపీ నేతలు ఎవరిదారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు అంటీ ముట్టనట్లు ఉన్న టీడీపీలోని సీనియర్ నాయకుడు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ మన్నే రవీంద్ర, టీడీపీ నియోజకర్గ ఇన్‌చార్జి ఎరిక్షన్ బాబు మధ్య వర్గపోరు పెల్లుబికింది. దీంతో టీడీపీకి చెందిన జిల్లా నాయకులు వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు గత రెండు, మూడు రోజులుగా విశ్వ ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. తొలివిడతలో కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామితోపాటు గుంటూరు జిల్లాకు చెందిన పలువురు నాయకులు యర్రగొండపాలెం వెళ్లి మరీ ఇరువురితో మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. అయినా వినకపోయే సరికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వెళ్లి ఇరువురితో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయినా వారిద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు కాస్తా ఫ్లెక్సీల వివాదం వరకు వెళ్లినట్లు సమాచారం.
బూదాల అజిత x డేవిడ్‌రాజు
2019 సాధారణ ఎన్నికల్లో యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఘోర పరాజయం చవిచూసిన బూదాల అజితారావు నాటి నుంచి నేటి వరకు పార్టీ ఊసే లేకుండా, కేడర్‌కు కూడా కనపడకుండా దూరంగా ఉన్నారు. గత నాలుగేళ్ల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన బూదాల అజితారావు 2019 ఎన్నికల వేళ ప్రత్యక్షమయ్యారు. పార్టీ ఆమెను పక్కన పెట్టినప్పటికీ తనకంటూ ఒక వర్గం ఉందంటూ యర్రగొండపాలెం వస్తున్న అధినేత చంద్రబాబు వద్ద బలప్రదర్శన చేసేందుకు సిద్ధమయ్యారు.
2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున బరిలోకి దిగి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిష్మాతో నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన పాలపర్తి డేవిడ్‌రాజు.. చంద్రబాబు విసిరిన డబ్బుకు కక్కుర్తిపడి పచ్చ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో టికెట్ తనదేనని భావించిన డేవిడ్‌రాజుకు చంద్రబాబు మొండిచేయి చూపారు. తాజాగా డేవిడ్ రాజు కూడా ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ఈసారైనా తనకు టిక్కెట్ ఇవ్వండని ప్రాధేయపడేందుకు సిద్ధమయ్యారు. తనకు టికెట్ ఇవ్వకపోయినా తన కోడలుకు పోటీచేసే అవకాశం కల్పించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చుట్టూ తిరుగుతున్నట్లు పార్టీ కేడర్‌లో గుసగుసలు వినపడుతున్నాయి.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2014లో తొలిసారిగా సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగే సమయంలో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని బీసీలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నూకసాని బాలాజీని యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పుల్లలచెరువు మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీచేయించారు. వాస్తవంగా ఈ మండలం ఓసీలకు కేటాయించినప్పటికీ.. బీసీ సామాజిక వర్గానికి చెందిన బాలాజీని మండల ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అప్పటి రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన జెడ్పీ వైస్ చైర్మన్‌గా కొన్నాళ్లు పనిచేశారు. అప్పటి అధికార టీడీపీలో పెత్తనం చెలాయించే ఉద్దేశంతో పచ్చ కండువా కప్పుకున్న బాలాజీ ప్రస్తుతం జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గం తన గుప్పెట్లో ఉన్నట్లు భావిస్తూ కనిగిరి ప్రాంతానికి చెందిన ఎరిక్షన్‌బాబును నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగేలా సహకరించారు. ఇదిలా ఉండగా రాజకీయాలపై అంతగా అవగాహన లేని యువ వైద్యుడు డాక్టర్ అనిల్‌కుమార్ స్థానికత నినాదంతో తనకూ ఒక వర్గం ఉందంటూ చెప్పుకుంటున్నారు.

Comments
Please login to add a commentAdd a comment