No Face To Face Meeting And No Meetings In Nara Lokesh Yuvagalam Padayatra - Sakshi
Sakshi News home page

నారా వారు సమర్పించు...ముఖాముఖి..ఉత్తిదే...

Published Sat, Jul 29 2023 2:22 AM | Last Updated on Sat, Jul 29 2023 10:36 AM

గ్రానైట్‌ రంగ ప్రతినిధులతో మాట్లాడుతున్న లోకేష్‌  - Sakshi

గ్రానైట్‌ రంగ ప్రతినిధులతో మాట్లాడుతున్న లోకేష్‌

ఒంగోలు సబర్బన్‌: నారా వారు సమర్పించు... యువగళం పాదయాత్రలో లోకేష్‌ కార్యక్రమాల్లో ముఖాముఖిలు లేవు... సమావేశాలు లేవు... లోకేష్‌కు గోడు వెళ్లబోసుకున్న వారూ లేదు. ముందస్తు పథకం ప్రకారం తమ వారితో ప్లాన్‌ చేసిన కార్యక్రమాలను నిర్వహించడం, తర్వాత పచ్చ పత్రికలు పుంఖాను పుంఖాలుగా పేజీలలో అచ్చేయటం పరిపాటిగా మారింది. ముందుగా ప్రకటించే షెడ్యూలులో మాత్రం వివిధ వర్గాల వారితో లోకేష్‌ ముఖాముఖి నిర్వహిస్తారు అంటూ టీడీపీ నేతలు ఆర్భాటంగా ప్రకటిస్తారు. కానీ పాదయాత్ర మొదలయ్యేదే సాయంత్రం 5 గంటలకు.

రోజువారీ షెడ్యూల్‌ 14 నుంచి 16 కిలో మీటర్లకు పైగా నిర్ణయించుకుంటున్నారు. ముందుగా ప్రకటించుకున్న దూరాన్ని చేరుకోవాలంటే ఉదయం 9 గంటలకు ప్రారంభమైతే సాయంత్రానికి యువగళం పాదయాత్రలో ముఖాముఖి కార్యక్రమాలు, ప్రజలు వచ్చి చెప్పుకునే కష్టాలు, బాధలు, గగ్గోలు పెట్టడంలాంటివి లోకేష్‌ వినిటానికి సమయం ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటలకు వరకు నిద్ర మానుకొని ఎవరొచ్చి సమస్యలు చెప్పుకుంటారు. అధికారం చేతులో ఉండి అనుభవించినప్పుడు ప్రకాశం జిల్లాకానీ, జిల్లా ప్రజలు కానీ లోకేష్‌కు గుర్తుకు రాలేదు.

రాష్ట్ర మంత్రిగా మూడు శాఖలు నిర్వహించి అధికారాన్ని అనుభవించారు. టిడ్కో ఇళ్ల విషయంలో జిల్లాలోని మార్కాపురం పట్టణానికి ఒకే ఒక్కసారి వచ్చి వెళ్లారు. జిల్లా కేంద్రం ఒంగోలు ముఖం కూడా చూడలేదు. కానీ అధికారం పోయిన తరువాత వచ్చి ఈ సారి అధికారంలోకి వస్తే అన్నీ చేస్తాం, మరిన్ని ఉచితంగా ఇస్తాం అని లోకేశం చెబుతుంటే జిల్లా ప్రజలు పక్కున నవ్వుకుంటున్నారు. జిల్లా కేంద్రం ఒంగోలులో శుక్రవారం మధ్యాహ్నం గ్రానైట్‌ కార్మికులతో ముఖాముఖీ అని ముందుగా ప్రకటించి కొందరు టీడీపీ అభిమానులు, పార్టీ నాయకులు, పార్టీకి చెందిన గ్రానైట్‌ ఫ్యాక్టరీల యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఆ తరువాత సెల్ఫీ కార్యక్రమం అని ముఖ్యులకే అవకాశం ఇచ్చి మరికొందరికి సెల్ఫీ అవకాశం ఇవ్వకపోవటంతో నానా తిట్లు తిట్టుకుంటూ వెళ్లిపోయారు. ఇక సాయంత్రం ఐదు గంటలకు ఒంగోలులోని పాత గుంటూరు రోడ్డులోని ఏ–1 ఫంక్షన్‌ హాలు విడిది చేసిన బస నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించారు. మంగమ్మ కాలేజీ వద్ద బైపాస్‌ జంక్షన్‌లో యువతతో సమావేశం అన్నారు. అక్కడ సమావేశం ఏమీ లేదు అంత ఉత్తిదే. ఆ తరువాత ఒంగోలు వ్యవసాయ మార్కెట్‌ యార్డు వద్ద రైతులతో సమావేశం అన్నారు. అదీ లేదు...అంతా ఉత్తిత్తికే.

అయితే త్రోవగుంట వద్ద యువగళం పాదయాత్ర 2200 కిలో మీటర్ల మైలు రాయి అని మాత్రం శిలాఫలకం ఆవిష్కరించారు. త్రోవగుంట దాటిన తరువాత సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడు మండలంలోకి లోకేష్‌ కార్యక్రమం ప్రవేశించింది. ఏడుగుండ్లపాడులో స్థానికులతో సమావేశం అన్నారు. అదీ కూడా జరగలేదు. అదీ ఉత్తుత్తిదే. సీతారాంపురం కొస్టాల వద్ద పొగాకు రైతులతో సమావేశం అన్నారు, మద్దిపాడులో స్థానికులతో సమావేశం అన్నారు, వెల్లంపల్లిలో మహిళలతో సమావేశం అన్నారు, రాత్రి 11.35 గంటలకు గుండ్లాపల్లి తిరిగి గ్రానైట్‌ కార్మికులతో ముఖాముఖి అని షెడ్యూలు ప్రకటించారు. అన్నీ ఉత్తుత్తిదే అన్నట్లు యువగళం లోకేష్‌ పాదయాత్ర రన్నింగ్‌ రేస్‌లా సాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement