ఉత్సాహంగా రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలు
కొనకనమిట్ల: మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని వాగుమడుగు పంచాయతీ అంబాపురంలో గురువారం రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. అంబాపురంలోని అంబబాల సంగమేశ్వరస్వామి ఆలయం ఆవరణలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పాలపండ్ల విభాగం నుంచి ఆరుబంట సైజు వరకు (12క్వింటాల బండ) ఎడ్ల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాతల సహకారంతో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పశు ప్రదర్శన పోటీలు రైతులకు ఎంతగానో ఉత్సాహం నింపుతాయన్నారు. ఎడ్ల పోటీలను తిలకించేందుకు మండలంలోని పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. పోటీల్లో కంభం మండలం ఎల్‌కోటకు చెందిన ఉలవల హరికృష్ణ ఎడ్ల జత 2550 అడుగులు లాగి మొదటి స్థానంలో నిలిచాయి. అదే విధంగా పొదిలి మండలం రాములవీడుకు చెందిన సలగాల శ్రీవర్థన్, నాగరాజుకుంటకు చెందిన కుడుముల లక్ష్మిరెడ్డిల సంయుక్త ఎడ్ల జత 1393 అడుగులు లాగి రెండ వ స్థానంలో నిలిచాయి. పొదిలి మండలం రాములవీడుకు చెందిన గుంటూరి బాలయ్య, తాళ్లూరు మండలం లక్కవరానికి చెందిన కె.నరసింహారావుల సంయుక్త ఎడ్ల జత 1350 అడుగులు లాగి మూడవ స్థానంలో నిలిచాయి. అంబాపురంకు చెందిన మాదాల నాగమల్లేశ్వరి ఎడ్ల జత 1262 అడుగులు లాగి నాల్గవస్థానంలో నిలిచాయి. మొదటి, రెండు, మూడు బహుమతులను రూ.30వేలు, రూ.20వేలు, రూ.10 వేలను దాతలు చెన్నెబోయిన తిరుపాలు, కొల్లెబోయిన నడిపి వెంకటేశ్వర్లు, పెరికె రత్నంలు యజమానులకు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment