తెలుగు భాషలో చెరగని సంతకం.. నాగభైరవ
ఒంగోలు మెట్రో: అసలు సిసలైన తెలుగు నుడికారానికి, తెలుగు భాషకు చెరగని నిలువెత్తు సంతకం డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు అని ప్రముఖ రచయిత, డాక్టర్ జక్కంపూడి సీతారామారావు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం బృందావన గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణంలో జాతీయ కవి, కవిరత్న డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు సాహిత్య ప్రతిభా పురస్కారాల సభ నిర్వహించారు. ఈసందర్భంగా సీతారామారావు మాట్లాడుతూ సాహితీ జగత్తులో తనదంటూ బలమైన ముద్ర వేసిన కవి నాగభైరవ అని పేర్కొన్నారు. మరో ముఖ్య అతిథి శాంతా కళాశాల అధినేత పెంట్యాల శ్రీమన్నారాయణ మాట్లాడుతూ నాగభైరవ కవిగా సామాజిక ప్రయోజనాన్ని ఆశిస్తూ నేటి తరానికి ఉపయోగపడే సాహిత్య సృజన చేశారన్నారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ సోదరుడు కోటేశ్వరరావుతో గల అనుబంధాన్ని, అనుభవాలు పంచుకున్నారు. నరసం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ పురస్కార గ్రహీతలు అంకమ్మరావు, చంద్రమోహన్ రచనల గురించి సంక్షిప్తంగా సభకు పరిచయం చేశారు. ప్రజా గాయకుడు నూకతోటి శరత్‌బాబు తన అభ్యుదయ గేయాలతో సభను ఆనందింపజేశారు. అనంతరం నాగభైరవ కోటేశ్వరరావు పురస్కారాలను ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమ్మరావు, రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శెట్లెం చంద్రమోహన్‌లకు ప్రదానం చేశారు. నిర్వాహకులు, అతిథులు అందరి చేతులు మీదుగా పురస్కార గ్రహీతలను సత్కరించి, మెమొంటోలు, నగదు బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా పురస్కార గ్రహీతలు మాట్లాడుతూ నాగభైరవ కోటేశ్వరరావు పుస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమాన్ని నాగభైరవ పురస్కార కమిటీ చైర్మన్ కళారత్న డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థాన పాలకమండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య, రచయితలు, సాహిత్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
నాగభైరవ సాహిత్య పురస్కారాలు ప్రదానం
Comments
Please login to add a commentAdd a comment