
వరకట్న హత్య కేసులో నిందితుల అరెస్టు
మార్కాపురం: పట్టణంలోని కొండారెడ్డికాలనీలో గత నెల 26వ తేదీ గంజాయి లక్ష్మి అనే వివాహిత ఉరేసుకుని మృతిచెందిన కేసులో దర్యాప్తు చేసి వరకట్న హత్యకేసుగా మార్చి నిందితులను శనివారం అరెస్టు చేసినట్లు మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. శనివారం స్థానిక తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆ వివరాలు వెల్లడించారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామానికి చెందిన దుద్దుకూరి దేవమ్మ కుమార్తె లక్ష్మికి మార్కాపురం పట్టణంలోని కొండారెడ్డి కాలనీకి చెందిన గంజాయి సాయితో 2022లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. పెళ్లి సమయంలో భర్తతో పాటు కుటుంబ సభ్యులకు రూ.3 లక్షలు కట్నంగా ఇచ్చారు. కొంత కాలం తర్వాత భర్త సాయిబాబు, మామ అల్లూరయ్య, అత్త సుశీలమ్మ, మరిది గంజాయి డాన్ కలిసి లక్ష్మిని అదనపు కట్నం కోసం వేధించినట్లు దేవమ్మ ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో మరిది గంజాయి డాన్ గత నెల 26వ తేదీ లక్ష్మి తమ్ముడికి ఫోన్‌చేసి మీ అక్క ఇంట్లో తాడుతో ఉరేసుకుందని సమాచారమిచ్చాడు. బంధువులు వచ్చి చూడగా మృతురాలి ఒంటిమీద గాయాలు, మెడమీద తాడుతో బిగించినట్లుగా ఉన్న గుర్తులు ఉన్నాయి. ఆ మేరకు తల్లి దేవమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. శనివారం పట్టణ ఎస్సై సైదుబాబు తన సిబ్బందితో కలిసి నిందితుని ఇంటివద్దకు వెళ్లగా వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతో అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారించారు. అదనపు కట్నం కోసం మృతురాలిని శారీరకంగా, మానసికంగా వేధించి తాడుతో గొంతు బిగించి చంపినట్లు ఒప్పుకోవడంతో అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment