
ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలి
● విద్యార్థులకు కలెక్టర్ తమీమ్ అన్సారియా పిలుపు
ఒంగోలు సిటీ: ఇంటర్మీడియట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా సానుకూల దృక్పథంతో పరీక్షలు రాయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఇంటర్మీడియట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులతో శనివారం స్థానిక ప్రకాశం భవనం నుంచి జూమ్ మీటింగ్ నిర్వహించి కలెక్టర్ మాట్లాడారు. పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న తీరుపై ఆరా తీశారు. పలువురు విద్యార్థులతో నేరుగా మాట్లాడి భవిష్యత్తు లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవడానికి పదో తరగతి పరీక్షలు పాస్పోర్టు లాంటివని వ్యాఖ్యానించారు. పదో తరగతి విద్యార్థులకు ఆలిన్ వన్ గైడ్లు ఇచ్చామని, ట్యూటర్లను కూడా నియమించామని అన్నారు. వీటిని ఉపయోగించుకుని నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. అందరూ కనీసం డిగ్రీ పూర్తి చేయాలని చెప్పారు. 18 ఏళ్లు నిండే వరకు పెళ్లి చేసుకోబోనని ప్రతి ఆడపిల్ల తీర్మానం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థుల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని హాస్టల్ వార్డెన్లను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అంజల, పుల్లలచెరువు నుంచి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment