
మృత్యు వలలో!
సాగర తీరం అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల మృత్యు తీరమవుతోంది. చేప గుడ్లను మింగేసే జెల్లీఫిష్‌ను, నాచును తినడం ద్వారా మత్స్యసంపదను కాపాడుతున్న వీటికి ప్రాణగండం ఏర్పడింది. సముద్రగర్భంలో ఉండే ఇవి గుడ్లు పెట్టేందుకు తీరానికి వచ్చి మృత్యువాత పడుతున్నాయి. తమిళనాడుకు చెందిన మెకనైజ్డ్ బోట్లు తీరం సమీపానికొచ్చి వేటసాగించడం, భారీ వలలు, కాలుష్యం తదితర కారణాలతో నేడు అవి జీవన్మరణ పోరాటం సాగిస్తున్నాయి.
సింగరాయకొండ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రామాయపట్నం నుంచి చీరాల వరకూ విస్తరించి ఉన్న సముద్రతీరంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల కళేబరాలు దర్శనమిస్తుండడంపై మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా నవంబరు నుంచి మార్చి నెల మధ్యలో ఇవి సంతానోత్పత్తి కోసం థాయ్‌లాండ్, మలేషియా, ఇండోనేషియా తదితర దేశాల నుంచి సుమారు 20 వేల కిలోమీటర్లు ప్రయాణించి ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని సముద్రతీరాలను చేరుకుని గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసిన తరువాత తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లిపోతాయి. ఈ ప్రాంతాలకు వచ్చిన అవి గుడ్లు పెట్టే సమయంలో తీరానికి వస్తాయి. ఒక్కో తాబేలు గుడ్లు పిల్ల దశకు రావడానికి సుమారు 60 రోజులు పడుతుంది. ఈ ప్రక్రియ కోసం వచ్చిన తాబేళ్లు మృత్యువాత పడడం విచారకరం.
ఉమ్మడి జిల్లాలో 600 వరకూ మృతి
నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసం వరకు ఉమ్మడి ప్రకాశం తీరంలో 500 నుంచి 600 వరకూ మృతి చెంది ఉంటాయని చైన్నెకు చెందిన ‘ట్రీ ఫౌండేషన్ సంస్థ’ చెబుతోంది. ఈ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న తీర ప్రాంతాల్లో మైరెన్, మత్స్యశాఖ, పోలీస్‌శాఖకు చెందిన వారితో కలసి ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఉమ్మడి జిల్లాలోని తీరం వెంబడి వందల సంఖ్యలో ఇవి చనిపోయాయని గుర్తించింది. తాబేళ్లు సముద్రపు అడుగున ఉంటున్నప్పటికీ ప్రతీ 45 నిమిషాలకు ఒకసారి నీటిపైకి వచ్చి గాలి పీల్చుకొని మళ్లీ వెళ్లిపోతాయి. అలాగే గుడ్లు పెట్టే సమయంలోనూ తీరానికి వస్తుంటాయి. ఇదే వీటి పాలిట శాపంగా మారింది.
సాగరతీరంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల మరణ మృదంగం
ఉమ్మడి ప్రకాశంలో సుమారు 600 వరకూ మృత్యువాత తీరంలో భారీగా తాబేళ్ల కళేబరాలు తమిళనాడు సోనాబోట్లు, భారీ వలలు, కాలుష్యం కారణం సంరక్షణకు నామమాత్రపు చర్యలు
Comments
Please login to add a commentAdd a comment