
పిల్లల హక్కులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● ఏపీ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి
ఒంగోలు సిటీ: పిల్లల హక్కుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రైవేటు స్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకుంటామని ఏపీ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఒంగోలులో పలు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలను శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కనీస వసతులు కూడా లేవన్నారు. స్కూల్ ఫీజు చెల్లించని విద్యార్థులను క్లాస్ రూమ్ లో అందరి ముందు నిలబెడుతున్నారని, పిల్లల్ని ఫీజుల విషయంలో ఇబ్బంది పెడుతున్నారని దీనివల్ల పిల్లలు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారన్నారు. పరీక్ష సమయంలో పిల్లల చదువుపట్ల సరైన దృష్టి పెట్టలేకపోతున్నారన్నారు. విద్యార్థులకు కనీస సమాచారం అందించేలాగా చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్స్ స్కూల్లో ప్రదర్శించాలని స్కూల్ యాజమాన్యాన్ని ఆదేశించారు. పిల్లలు ఫీజులు కట్టలేదని వారిని మానసిక ఒత్తిడికి గురిచేస్తే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోజులో ఎక్కువ సమయం స్టడీ అవర్స్ పెట్టడం వలన వారు మానసిక ఒత్తిడికి గురవుతారని, పిల్లలకి కనీస సమయంలోనే చదువు నేర్పించాలన్నారు. క్లాస్ రూమ్స్ కి సరైన వెంటిలేషన్, పరిశుభ్రమైన టాయిలెట్స్ ఉండాలని, స్కూలు వదిలిన తర్వాత పిల్లలని జాగ్రత్తగా తల్లిదండ్రులకు అప్పగించాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యంపై ఉందన్నారు. స్కూల్లో కనీసం ఉండాల్సిన కంప్లైంట్ బాక్స్, చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్స్ ప్రదర్శించలేదని, కనీసం పాటించవలసిన నియమాల పట్ల ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తే ఆ స్కూల్ కి వెంటనే నోటీసులు జారీ చేయాల్సిందిగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో మండల విద్యాశాఖ అధికారి, బాలల సంక్షేమ కమిటీ సభ్యులు ఈ.నీలిమ వంశీ లత, బాలల సంరక్షణ విభాగం సిబ్బంది, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment