పీ–4 సర్వే పిడుగు | - | Sakshi
Sakshi News home page

పీ–4 సర్వే పిడుగు

Published Sun, Mar 2 2025 11:55 PM | Last Updated on Mon, Mar 3 2025 7:28 AM

పీ–4 సర్వే పిడుగు

పీ–4 సర్వే పిడుగు

పేదల పై

బేస్తవారిపేట: కూటమి నేతలు సూపర్‌ సిక్స్‌ అంటూ గత ఎన్నికల ప్రచారంలో ఉదరగొట్టారు. ఇంటింటికీ కరపత్రాలు పంచుతూ మీ ఇంటికి ఇన్ని పథకాలు వస్తాయి..ఇంత మేలు జరుగుతుందంటూ నమ్మించారు. కూటమి అధికారంలోకి వస్తే మీ జీవితాలు మెరుగుపడతాయన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక తొమ్మిది నెలలవుతున్నా వీటి అమలుకు నోచుకోలేదు. చెప్పిన వాగ్దానాలు అమలు చేయకుండా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తాజాగా పీ–4 సర్వే పేరిట ఉన్న సంక్షేమ పథకాలను ఎత్తేసేందుకు శ్రీకారం చుట్టారు.

పీ–4 సర్వేలో భాగంగా సచివాలయ ఉద్యోగులు ప్రజలకు ఫోన్‌ చేసి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. టీవీ, ఏసీ, ఫోర్‌ వీలర్‌, టూ వీలర్‌, ఇతర గృహోపకరణాలు, ఇళ్ల స్వరూపం, లేకులా, స్లాబా, బ్యాంక్‌ ఖాతా.... ఇలా 27 రకాల ప్రశ్నలు అడిగి సమాధానాలను సిబ్బంది నింపాల్సిన పరిస్థితి. ఆపై ప్రజల ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నమోదు చేసి ఈ తతంగాన్ని ముగిస్తున్నారు. జిల్లాలో 1392 రేషన్‌ దుకాణాల పరిధిలో 6.73 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. వేల కుటుంబాలు కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. వీరంతా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలే. అప్పోసప్పో చేసి, నెలవారీ వాయిదాల్లో ఏసీలను ఎక్కువ మంది ఏర్పాటు చేసుకుని ఉంటారు. అయితే ఇది ఉందని తెలిస్తే చాలు వెంటనే సదరు వివరాలను ప్రభుత్వ రికార్డుల్లోకి సిబ్బంది నమోదు చేస్తున్నారు. ఈ వ్యవహారంతో తమకు సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే ఆందోళన పేదల్లో నెలకొంది.

నిరాకరించినా..నమోదే...

సర్వేలో సిబ్బంది పొందుపర్చే అంశాలు ప్రస్తుత జీవనశైలిలో భాగమైనవే. స్మార్ట్‌ఫోన్‌లు, బైక్‌లు ఇలాంటి ప్రశ్నలు ఉండటంతో సంక్షేమ పథకాల్లో కోత పడుతుందనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. సర్వేకు ఎవరైనా నిరాకరిస్తే వారి పేర్లను సైతం నమోదు చేయాలనే ఆదేశాలు సిబ్బందికి జారీ చేయడం కలవరానికి గురిచేస్తోంది.

బాబూ నమ్మండయ్యా..

పీ–4 సర్వేను పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్టనర్‌ షిప్‌తో నిర్వహిస్తున్నారు. దీన్ని నమ్మాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. జిల్లాలోని అన్ని సచివాలయాల పరిధిలో ఉన్న కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. ఇంటి వద్దకు సిబ్బంది వెళ్లి వివిధ రకాల సమాచారాన్ని సేకరించి యాప్‌లో నమోదు చేస్తున్నారు. సర్వే పకడ్బందీగా నిర్వహించాలని, దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని చెబుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల గుర్తింపు కోసం ఇది దోహదపడుతుందనే అంశాన్ని ప్రజలకు తెలియజేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి అధికారులు చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు యథావిధిగా కొనసాగుతాయని, ఇందులో ఎలాంటి అపోహలొద్దని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అంతా అయోమయం నెలకొంది.

27 రకాల ప్రశ్నలతో సచివాలయ ఉద్యోగుల సర్వే ఇంటిలోని విలువైన వస్తువుల వివరాల నమోదు చడీచప్పుడు లేకుండా సాగుతున్న సర్వే సంక్షేమ పథకాల లబ్ధిదారుల కోత కోసమేనా ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement