ప్రకృతి అందాలకు నిలయం నల్లమల
అభయారణ్యంలో 87కు పైగా పెద్ద పులులు
400 కు పైగా చిరుతలు, దుప్పులు, జింకలు
అరుదైన పక్షిజాతులు, వృక్ష సంపద
నేడు వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం
మార్కాపురం: నల్లమల అటవీ ప్రాంతం ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాల పరిధిలో సుమారు 6.50 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఈ అటవీ ప్రాంతంలో 87కు పైగా రాయల్ బెంగాల్ టైగర్లు, సుమారు 400 కు పైగా చిరుతలు తిరుగుతున్నాయి. వీటితోపాటు వందల సంఖ్యలో దుప్పులు, జింకలు, నీల్‌గాయ్‌లు, ఎలుగుబంట్లు ఉన్నాయి. వీటితోపాటు ఆకాశంలో 4 నుంచి 5 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ క్షణాల్లో భూమిమీద తిరిగే వన్యప్రాణులను తినే అరుదైన క్రస్టడ్ హక్ ఈగల్ (నల్లపాముల గద్ద), షార్టు టోడోస్ స్నేక్‌ఈగల్, హనీబజర్, క్రస్టడ్ సర్పెంట్ ఈగల్‌లు సంచరిస్తున్నాయి. ఇక రష్యా నుంచి 8 వేల కిలోమీటర్లు ప్రయాణించి నల్లమలకు వచ్చే మాన్‌టెగ్యూష్ హారియర్, పాలిడ్ హ్యారియర్ తదితర పక్షులకు కూడా నల్లమల ప్రాంతం నివాసంగా మారింది.
మార్కాపురానికి చుట్టుపక్కల నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పెద్దదోర్నాల, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, పెద్దారవీడు, అర్ధవీడు, గిద్దలూరు తదితర మండలాల్లో అటవీ సమీప గ్రామాలున్నాయి. పెద్దదోర్నాల మండలంలోని నల్లగుంట్ల, వై చర్లోపల్లి, తుమ్మలబైలు, శ్రీశైల శిఖరం, బొమ్మలాపురం, ఘాట్‌రోడ్డు, అర్ధవీడు మండలంలోని వెలగలపాయ, మాగుటూరు తాండ, గన్నెపల్లి, లక్ష్మీపురం, దొనకొండ, మార్కాపురం మండలం గొట్టిపడియ, పెద్దారవీడు మండలం గుండంచర్ల తదితర గ్రామాల సమీపాల్లోకి వన్యప్రాణులు తరచుగా వస్తుంటాయి. ముఖ్యంగా పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, నెమళ్లు సంచరిస్తున్నాయి. అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు అన్నీరకాల చర్యలు తీసుకుంటున్నారు. పెద్దపులులు, చిరుతలకు అడవిలోనే నీటి సమస్య లేకుండా సోలార్ సాసర్‌పిట్‌లు ఏర్పాటుచేసి అధికారులు నీటి సమస్య తీర్చారు.
నల్లమల పరిధి పెరిగిపోతోంది. గతంలో ఏపీలోని ప్రకాశం, గుంటూరు, కర్నూల్, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ తదితర జిల్లాలతో అనుసంధానంగా ఉండగా ఇప్పుడు శేషాచలం అడవులను కలుపుతూ ఎన్‌ఎస్‌టీఆర్ (నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు), శేషాచలం అడవులను కలిపి టైగర్ కారిడార్ ఏర్పాటైంది. నల్లమల అడవిలోని పెద్దపులులు కడప మీదుగా వనిపెంట, ఒంటిమిట్ట తదితర ప్రాంతాల్లో ఉన్న శేషచలం అడవుల్లో కూడా సంచరిస్తున్నాయి. దీంతో నల్లమల పరిధి 8 వేల చదరపు కిలోమీటర్ల నుంచి 16 వేల చదరపు కిలోమీటర్లకు విస్తరించింది.
పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 1000 మంది సిబ్బందిని, 85 బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. పులుల సంరక్షణకు తీసుకునే చర్యల వలన పులుల సంఖ్య పెరగడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment