
చంద్రబాబుది రాజ్యాంగ ఉల్లంఘన
● వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ
రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి
ఒంగోలు సిటీ: ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతా రహితంగా ప్రకటనలు చేయడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి విమర్శించారు. శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఏ ఒక్క పనీ చేయకూడదని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం సరికాదని మండిపడ్డారు. ఆదివారం కె.వి.రమణారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికలప్పుడే రాజకీయాలు అని, తర్వాత కులం, మతం, పార్టీలు చూడమంటూ అర్హులందరికీ తన పాలనలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం చేశారన్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు బహిరంగ సభల్లో చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఆయన ఆ పదవికి ఏమాత్రం అర్హుడు కాదనిపిస్తోందన్నారు. కేవలం ఒకే ఒక్క వర్గానికి న్యాయం చేయాలనుకోవడం సరికాదన్నారు. నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు సరికాదన్నారు. గత ఎన్నికల్లో నలభై శాతం మంది ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని, ఇప్పుడు వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం రాజ్యాంగాన్నే అవమానించినట్లని విమర్శించారు. మీరు ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో నాయకులు కాదని ప్రజలందరూ ఎన్నుకుంటేనే మీరు ముఖ్యమంత్రి అయ్యారనే విషయాన్ని ఆలోచించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం పాలు చేస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న మీరు ఆ పదవిలో ఒక్క నిమిషం కూడా ఉండటానికి అర్హత లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment