
ఆటో డ్రైవర్ నిజాయితీ
● ల్యాప్‌టాప్ బ్యాగ్ పోలీస్‌స్టేషన్‌లో అందజేత
పామూరు: ఆటోడ్రైవర్ నిజాయితీని చాటుకున్నాడు. తనదికాని వస్తువు అవసరం లేదంటూ దానిని పోలీసులకు అప్పజెప్పాడు. వివరాలు.. మండల కేంద్రమైన పామూరు విరాట్‌నగర్ జంక్షన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి ల్యాప్‌టాప్ బ్యాగును పోగొట్టుకోగా రోడ్డుపై పడిఉంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న పామూరుకు చెందిన ఆటోడ్రైవర్ లక్కనబోయిన నారాయణ బ్యాగును చూసి దానిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి ఎస్సై టి.కిషోర్‌బాబుకు అందజేశారు. ఆటోడ్రైవర్‌ను ఎస్సై అభినందించారు. ల్యాప్‌టాప్ పోగొట్టుకున్నవారు పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.
‘ఏకేయూ పరిశోధక నిబంధనావళి’ ఆవిష్కరణ
ఒంగోలు సిటీ: ఆంధ్ర కేసరి యూనివర్శిటీలో పీహెచ్‌డీ స్కాలర్లు, వారికి సూచనలు, సలహాలిచ్చే రీసెర్చ్ డైరెక్టర్లకు దిక్సూచిగా ఉపయోగపడేలా ‘ఏకేయూ పరిశోధక నిబంధనావళి’ని రూపొందించారు. ఈ పుస్తకాన్ని సోమవారం సాయంత్రం వర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబుతో కలిసి వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. యూనివర్సిటీ రీసెర్చ్ విభాగంలో భవిష్యత్ అవసరాల కోసం ఈ నిబంధనావళి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. ఆంధ్ర కేసరి యూనివర్శిటీ పరిధిలో పరిశోధకులు, పరిశోధనలో భాగస్వాములైన రీసెర్చ్ డైరెక్టర్లను దృష్టిలో ఉంచుకుని నిబంధనావళిని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఏకేయూ పరిధిలో మొత్తం 52 మంది విద్యార్థులు తమ పరిశోధనలను కొనసాగిస్తున్నట్లు వర్శిటీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ డైరెక్టర్, వైస్ ప్రిన్సిపాల్ ఎన్.నిర్మలామణి వెల్లడించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రాజమోహన్‌రావు, సీడీసీ డీన్ ప్రొఫెసర్ సోమశేఖర తదితరులు పాల్గొన్నారు.
డ్రెయినేజీలో జారిపడి వ్యక్తి మృతి
మార్కాపురం: డ్రెయినేజీలో జారిపడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి వేళ మార్కాపురం పట్టణంలోని రామలక్ష్మణ వీధిలో చోటుచేసుకుంది. వివరాలు.. రామలక్ష్మణ వీధిలో నివాసం ఉండే తాడి వెంకటేశ్వరరావు(39) ప్లంబర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇంటికి వెళ్లే క్రమంలో చీకటిలో కాలుజారి డ్రెయినేజీలో పడిపోయాడు. డ్రెయినేజీలో ఉన్న రాయి తగలడంతో తలకు బలమైన గాయమై రక్తస్రావమైంది. కాసేపటి తర్వాత దారినపోయేవారు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే వెంకటేశ్వరరావు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జలపాతంలో పడి కడితి మృతి
సీఎస్‌పురం(పామూరు): భైరవకోన కొండ పైనుంచి కడితి ప్రమాదవశాత్తు జలపాతంలో జారిపడి మృత్యువాత పడింది. ఈ సంఘటన సోమవారం వెలుగు చూసింది. ఆలయ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ కనిగిరి ఎఫ్‌ఆర్‌ఓ టి.ఉమామహేశ్వరరెడ్డి, ఎఫ్‌ఎస్‌ఓ షేక్.అలీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కడితిని బయటకు తీయించి, పశువైద్యాధికారి షేక్.మునీర్‌తో పోస్టుమార్టం చేయించారు. అనంతరం కడితి కళేబరాన్ని ఖననం చేశారు. అంబవరం ఎఫ్‌బీఓ డి.బ్రహ్మయ్య, వైద్య సిబ్బంది రాజేష్, ఆదినారాయణ పాల్గొన్నారు.

ఆటో డ్రైవర్ నిజాయితీ

ఆటో డ్రైవర్ నిజాయితీ

ఆటో డ్రైవర్ నిజాయితీ
Comments
Please login to add a commentAdd a comment