
సర్వేలపై అలసత్వం వహిస్తే చర్యలు
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సిటీ: జిల్లాలో నిర్వహిస్తున్న ఎంఎస్‌ఎంఈ సర్వే, పీ4 సర్వేలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని, అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తమీమ్ అన్సారియా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలను హెచ్చరించారు. గృహ నిర్మాణాల పురోగతి, ఎంఎస్‌ఎంఈ సర్వే, పీ4 సర్వే, మిస్సింగ్ సిటిజన్స్ మ్యాపింగ్, సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ అటెండెన్స్, గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య ఏర్పాట్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, జాతీయ ఉపాధి హామీ పథకం అమలు, స్కూల్ టాయిలెట్ల ఇన్‌ఫెక్షన్, తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఏపీవోలతో సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలిసి నిర్వహించిన ఈ సమీక్షలో పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ సర్వేను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పీ4 సర్వేను కూడా ఈ నెల 4వ తేదీలోపే పూర్తి చేయాలని చెప్పారు. నిర్దేశించిన గడువులోగా సర్వేలు పుర్తిచేయకుండా అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారులు వేగంగా ఇళ్లు నిర్మించుకునేందుకు చర్యలు చేపట్టడంతో పాటు అవసరమైన వారికి త్వరగా పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సచివాలయ సిబ్బంది వంద శాతం బయోమెట్రిక్ హాజరు వేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ హాజరుపై ప్రతిరోజూ మానిటరింగ్ చేయాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమినర్లను ఆదేశించారు. గృహనిర్మాణాలకు సంబంధించి 90 రోజుల పని దినాలను లక్ష్యం మేరకు కల్పించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఎంపీడీఓలు, ఏపీడీలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధి హామీ పనులను పర్యవేక్షించడంతో పాటు పథకం కింద కేటాయించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేసేలా దృష్టి సారించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈఓ చిరంజీవి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బాలశంకరరావు, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, జిల్లా పరిశ్రమల శాఖాధికారి శ్రీనివాసరావు, డీపీఓ వెంకటనాయుడు, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, సీపీఓ వేంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, పశుసంవర్థకశాఖ జేడీ బేబీరాణి, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment