
ఉద్యోగాల పేరుతో మోసం
ఒంగోలు టౌన్: ఎంప్లాయిమెంటు కార్యాలయంలో విధులు నిర్వహించే ఒక ఉద్యోగి ఉద్యోగాలిప్పిస్తానంటూ పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు దర్శికి చెందిన బాధితులు ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలిసి తమకు జరిగిన మోసాన్ని తెలియజేశారు. దర్శి ప్రాంతానికి చెందిన ఆరుగురికి ఉద్యోగాలిప్పిస్తానంటూ ఎంప్లాయిమెంటు ఆఫీసు ఉద్యోగి ఒకరు ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల చొప్పున మొత్తం 9 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలిపారు. ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేయడంతో తమ దగ్గర వసూలు చేసిన డబ్బు తిరిగివ్వమని అడుగుతుంటే జవాబు చెప్పడం లేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలని, మోసానికి పాల్పడిన ఉద్యోగిని కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే, గృహం కొనుగోలు కోసమంటూ అప్పుగా డబ్బు తీసుకుని తిరిగివ్వమంటే దాడి చేయడానికి వస్తున్నారని నేలటూరు గ్రామానికి చెందిన ఒక మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మూడు నాలుగు నెలల్లో తిరిగిస్తానని చెప్పడంతో తన కుమార్తె చదువు, వివాహం కోసం దాచుకున్న రూ.5 లక్షలు ఇచ్చానని, మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా నలుమూలల నుంచి మొత్తం 78 మంది బాధితులు వివిధ సమస్యలపై ఫిర్యాదు చేశారు. వారితో మాట్లాడిన ఎస్పీ ఆయా పోలీసు స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితులకు వెంటనే న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ సీఐ సుధాకర్, రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు, సీసీఎస్ సీఐ జగదీష్, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, వేదిక ఎస్సైలు షేక్ రజియా సుల్తానా, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎంప్లాయిమెంట్ కార్యాలయ ఉద్యోగిపై ఎస్పీకి బాధితుల ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment