ఇంజన్‌లో మంటలు.. కారు దగ్ధం
హనుమంతునిపాడు: మరమ్మతుల కోసం తీసుకెళ్తుండగా ఇంజన్‌లో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. ఈ సంఘటన హనుమంతునిపాడు మండలంలోని హాజీపురం సమీపంలో సోమవారం రాత్రి ఒంటి గంట సమయంలో చోటుచేసుకుంది. ఎస్సై ఎం.మాధవరావు కథనం మేరకు.. కనిగిరి పట్టణానికి చెందిన సయ్యద్ హనీఫ్‌కు చెందిన కారుకు మరమ్మతులు చేయించేందుకు డ్రైవర్ మన్నెం కృపాదానం కర్నూలు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో హాజీపురం సమీపంలోని టూరిజం పార్కు వద్ద ఇంజన్ నుంచి పొగలు వచ్చాయి. డ్రైవర్ కారు ఆపి బాయ్‌నెట్ డోర్ తెరవగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో డ్రైవర్ ముఖానికి కాలిన గాయాలయ్యాయి. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి మంటలు ఆర్పివేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఏఆర్ కానిస్టేబుల్ అదృశ్యం
● పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
కంభం: తన భర్త 15 రోజులుగా ఇంటికి రావడం లేదని షేక్ నఫియా అనే వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. కంభం పట్టణానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఆరీఫ్ బాషాతో నఫియాకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ఇటీవల కాలంలో భర్త ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో ఎస్పీ కార్యాలయంలో ఆమె గోడు వెళ్లబోసుకున్నారు. ఉన్నతాధికారుల సూచన మేరకు మంగళవారం ఆమె కంభం పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత 7 నెలలుగా ఇంటి అవసరాలకు భర్త డబ్బు ఇవ్వడం లేదని, గత 15 రోజులుగా ఫోన్ స్విచాఫ్ చేశాడని వాపోయారు. పోలీసులు విచారించి న్యాయం చేయాలని కోరారు.
కేసుల పరిష్కారానికి
కక్షిదారులు సహకరించాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి
ఒంగోలు: ఇరువర్గాల ఆమోదంతో కేసుల పరిష్కారానికి కక్షిదారులంతా సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎ.భారతి పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీ రెండో శనివారం దేశవ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని న్యాయస్థానాల్లో ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తారన్నారు. రాజీకి అర్హత కలిగిన అన్ని క్రిమినల్ కేసులు, మోటారు వాహన ప్రమాద బీమా పరిహారపు చెల్లింపు కేసులు, చెక్ బౌన్స్ కేసులు, వివాహ సంబంధ వ్యాజ్యాలు, అన్ని రకాల సివిల్ కేసులు ఇరువర్గాల ఆమోదంతో పరిష్కరిస్తారన్నారు. ఈ అవకాశాన్ని న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల్లో ఉన్నవారు ఉపయోగించుకుని వ్యాజ్యాలను పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్‌లో పరిష్కరించుకున్న కేసుల్లో తీర్పు అంతిమతీర్పు అని, కోర్టుల్లో చెల్లించిన ఫీజు కూడా తిరిగి పొందవచ్చన్నారు. ప్రీ సిట్టింగ్ రూపంలో ఇరువర్గాల ఆమోదంతో ముందస్తుగా వ్యాజ్యాల పరిష్కారానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ, సంబంధిత న్యాయవాదులు, మీడియేషన్ న్యాయవాదులు సహకరిస్తారని, ఇదే విధంగా పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులు ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కారానికి సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment