పేర్నమిట్ట గ్రామానికి చెందిన తుళ్లూరు బోసుబాబు తనకు పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా తిప్పుకుంటున్నారంటూ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పేర్నమిట్ట ఎస్సీ కాలనీకి చెందిన తుళ్లూరి ప్రభుదాసుకు 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఐదు సెంట్ల నివాస స్థలాన్ని కేటాయించింది. ఆ స్థలంలో ఏళ్లుగా నివాసం ఉంటున్నామని అర్జీదారురాలైన తుళ్లూరు సుభాషిణి భర్త తుళ్లూరి బోసుబాబు ఆ స్థలానికి పొజిషన్ సర్టిఫికెట్ కోసం జనవరి 30వ తేదీన దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం ఒంగోలు ఆర్డీఓ కార్యాలయంలో పొజిషన్ సర్టిఫికెట్ ఇప్పించాలని మొరపెట్టుకోగా తహసీల్దార్‌ను కలవాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు తహసీల్దార్ ఆదిలక్ష్మిని కలవగా‘మీరు కలెక్టర్ ఆఫీస్ కో, ఆర్డీవోకో ఫిర్యాదు చేసినంత మాత్రాన నేను భయపడతానా, ఆర్టీఏ పెట్టినంత మాత్రాన నేను భయపడతానా, పని అయినప్పుడు తెలియజేస్తాం.. అప్పుడే రావాలి మీరు వెళ్లండి ఇక్కడ నుంచి’ అని అనడంతో బోసుబాబు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు గురించి చెప్పకుండా రోజూ తిప్పుకుంటున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఎస్సై వి.అజయ్‌బాబు అర్జీదారుడితో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. అర్జీదారుడు నిరసన తెలపడంపై పేర్నమిట్ట–3 వీఆర్‌ఓ కె.జాలయ్య మాట్లాడుతూ.. జనవరి 30వ తేదీ పొజిషన్ సర్టిఫికెట్ కోసం తుళ్లూరి సుభాషిణి దరఖాస్తు చేశారని, ఫిబ్రవరి 5వ తేదీ ఫీల్డ్ వెరిఫికేషన్ చేశామన్నారు. ఆ స్థలంలో గృహ నిర్మాణం చేపట్టగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని, నిబంధనల ప్రకారం నిర్మాణం జరిగి ఉన్న స్థలానికి పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వడం సాధ్యపడదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment