
రేషన్‌కార్డుదారులకు ఈనెల అందని కందిపప్పు
ఉగాది పండుగకు పప్పన్నం లేనట్లే..
బయట మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.160
మార్కాపురం: తెలుగు వారి పెద్దపండుగైన ఉగాదికి రేషన్‌కార్డుదారులు పప్పన్నం తినలేని పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 4 నెలల నుంచి కందిపప్పులో కోత విధిస్తూ ఈనెల నుంచి పూర్తిగా నిలిపేశారు. జిల్లాలో మొత్తం రేషన్ దుకాణాలు 1392, రేషన్‌కార్డు దారులు 6,76,160 మంది ఉన్నారు. సుమారు నెలకు 655 టన్నుల వరకూ కందిపప్పు అవసరం. ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా కిలో రూ.67కే కందిపప్పు అందిస్తోంది. దీంతో చాలా మంది ప్రతినెలా కందిపప్పు, చెక్కర, బియ్యం తీసుకుంటున్నారు. నవంబరు నుంచి కూటమి ప్రభుత్వం రేషన్ సరుకుల్లో ప్రధానమైన కందిపప్పు సరఫరాలో కోత విధిస్తూ మార్చి నెలలో ఏకంగా కోటా తీసేసింది. దీంతో రేషన్‌కార్డుదారులు పప్పన్నం తినాలంటే బయట మార్కెట్‌లో కిలో రూ.160 పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది.
కందిపప్పు కేటాయింపు ఇలా...
మార్కాపురం పౌరసరఫరాల శాఖ గోడౌన్ పరిధిలో మార్కాపురం, తర్లుపాడు, త్రిపురాంతకం, పెద్దారవీడు, పెద్దదోర్నాల మండలాలు ఉన్నాయి. ప్రతి నెలా ఈ మండలాల్లోని రేషన్‌షాపులతోపాటు దొనకొండలో 8 షాపులు, కొనకనమిట్లలో 6 షాపులకు గానూ మొత్తం కలిపి 150 రేషన్ దుకాణాలకు 78 టన్నుల కందిపప్పు రావాల్సి ఉండగా జనవరిలో 45 టన్నుల కందిపప్పు మాత్రమే సరఫరా చేశారు. పొదిలి పౌరసరఫరాల శాఖ గోడౌన్ పరిధిలోని పొదిలి, కొనకనమిట్ల మండలాలకు గానూ 40 టన్నుల కందిపప్పునకు గాను 28 టన్నుల కందిపప్పు మాత్రమే సరఫరా అయింది. మార్చిలో కందిపప్పు సరఫరా పూర్తిగా నిలిపేశారు.
Comments
Please login to add a commentAdd a comment