జరిమానా 20 వేలు!
పన్ను 13 వేలు..
ఒంగోలు టౌన్:
ఆస్తి పన్ను, నీటి పన్నుల వసూళ్ల విషయంలో ఒంగోలు నగరపాలక సంస్థ ఉద్యోగుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 31వ తేదీతో ఆర్థిక సంవత్సరం గడువు ముగుస్తుండటంతో పన్ను బకాయిల వసూళ్లపై నగరపాలక సంస్థ రెవెన్యూ, ఇంజినీరింగ్ అధికారులు ఒక్కసారిగా ప్రజలపై ఒత్తిడి పెంచి జులుం ప్రదర్శిస్తున్నారు. పన్నుల వసూళ్లపై ఇన్నాళ్లూ నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రస్తుతం ఏకంగా మంచినీటి కుళాయిలు కట్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అంతేగాకుండా అసలు పన్ను కంటే జరిమానాలు రెట్టింపు వేసి జనాన్ని వేధిస్తున్నారు. మంచినీటి కనెక్షన్ లేకపోయినా సరే నీటి పన్ను కట్టమంటూ విడ్డూరంగా మాట్లాడుతుండటంతో నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
స్పెషల్ డ్రైవ్ పేరుతో వేధింపులు...
ఒంగోలు నగరంలోని సంతపేట, సుజాతనగర్, ఆర్‌పీ రోడ్డు, పీఐపీ రోడ్డు, రాజీవ్ నగర్‌లో పన్నుల వసూళ్లపై బుధవారం నగరపాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుతో ప్రజలు భయాందోళకు గురయ్యారు. కరోనా మహమ్మారి దెబ్బకు నగరంలో అనేక మంది వ్యాపారాలు దెబ్బతిన్నాయి. రెండేళ్లపాటు వ్యాపారాలు లేక నష్టాలపాలయ్యారు. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు, సామాన్యులు కుటుంబ పోషణ కూడా కష్టమై ఇబ్బందులు పడ్డారు. దాంతో అనేక మంది ఇంటిపన్నులు, మంచినీటి కుళాయి పన్నులు చెల్లించలేకపోయారు. మానవతా దృక్పథంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పన్ను వసూళ్ల విషయంలో ప్రజలపై ఒత్తిడి చేయలేదు. దాంతో అనేక మంది సామాన్యులు, చిరువ్యాపారులు పన్ను బకాయిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావడంతో సకాలంలో పన్నులు చెల్లించని పౌరులను నగరపాలక సంస్థ అధికారులు దొంగల్లాగా చూస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. పన్నులన్నీ చెల్లించాలంటూ ఒకేసారి తీవ్రమైన ఒత్తిడికి గురిచేయడంపై ఆందోళన చెందుతున్నారు.
కుళాయి మంజూరు చేయకుండానే పన్ను..!
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమృత్ పథకంలో మంచినీటి కుళాయి కోసం నాగాంజనేయులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, కుళాయి మంజూరు చేయకుండానే దానికి పన్ను వేశారు. ఇప్పుడు తాజాగా నగరపాలక సంస్థ అధికారి భాస్కర్ మంచినీటి కనెక్షన్ పీకేస్తామని చెప్పడంతో ఆయనకేమీ పాలుపోలేదు. అయ్యా.. నాకు నగరపాలక సంస్థకు సంబంధించిన మంచినీటి కుళాయి కనెక్షనే లేదు.. నా సొంత ఖర్చులతో ఇంట్లో బోరు వేసుకున్నానని ఆయన చెప్పుకున్నారు. అయినప్పటికీ ఆర్‌ఓ వినలేదు. బోరు కనెక్షన్ పీకేస్తామంటూ హెచ్చరించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించినట్లు బాధితుడు వాపోయాడు. పన్ను కట్టేందుకు కాస్త సమయం ఇవ్వమని బతిమాలినప్పటికీ వినకుండా అవమానకరంగా మాట్లాడినట్లు చెపుతున్నారు. జరిమానాతో సహా పన్ను కట్టకపోతే నీవు ఎలా వ్యాపారం చేసుకుంటావో చూస్తానంటూ వార్నింగ్ ఇవ్వడంతో భయాందోళనకు గురైన నాగాంజనేయులు.. కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇది కేవలం నాగాంజనేయులు సమస్య మాత్రమే కాదు. గత కొన్ని రోజులుగా నగరంలోని అనేక మంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య అని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. పన్నులు చెల్లించడానికి ప్రజలకు మరికొంత సమయం ఇవ్వాలని, పెద్ద మొత్తంలో బకాయిలున్న వారికి విడతల వారీగా పన్నులు చెల్లించుకునే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాకుండా పన్నుల మీద విధించిన జరిమానాలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.
నగరపాలక సంస్థలో పన్ను పేరుతో జులుం.! పన్నుల భారంతో ప్రజలు విలవిల మంచినీటి కనెక్షన్ లేకపోయినా పన్ను కట్టమంటూ ఒత్తిడి వారం టైం ఇవ్వమని అడిగినా.. ససేమిరా అంటున్న ఉద్యోగులు ఉద్యోగుల వేధింపులతో చిరువ్యాపారులు, సామాన్య ప్రజల బెంబేలు
రెట్టింపు జరిమానాలతో బెంబేలు...
పన్నులు కడితే సరేసరి.. లేకపోతే ఇంటి కుళాయి కనెక్షన్లు కట్ చేస్తామంటూ నగరపాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అయితే, పన్నుల వరకై తే అప్పోసొప్పో చేసి చెల్లించేవారిమని, కానీ, రెట్టింపు జరిమానాలు వేసి కడతారా.. చస్తారా..? అంటూ ఒత్తిడి చేస్తే ఎలాగని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని మంగమూరు రోడ్డులో నివాసముంటున్న పెరకం నాగాంజనేయులుకు నగరపాలక సంస్థ ఉద్యోగులు ఇంటిపన్ను కట్టాల్సిందిగా గురువారం నోటీసులిచ్చారు. అసలు పన్ను 13 వేల రూపాయలు కాగా, దానికి జరిమానా 20 వేల రూపాయలు వేయడంతో ఆయన బిత్తరపోయారు. మొత్తం 33 వేల రుపాయలను సాయంత్రంలోపు కట్టకపోతే మీ ఇంటి మంచినీటి కుళాయి కనెక్షన్ పీకేస్తామంటూ నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి భాస్కర్ బెదిరింపులకు దిగినట్లు నాగాంజనేయులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment