బినామీ కులకలం! | - | Sakshi
Sakshi News home page

బినామీ కులకలం!

Published Fri, Mar 7 2025 9:27 AM | Last Updated on Fri, Mar 7 2025 9:27 AM

-

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రతిష్టాత్మక ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ కాలేజీలో ఆయన చెప్పిందే వేదం.. ఆయన ఆ కళాశాలలో పనిచేయరు..ఆయనకు ఆ కాలేజీకి ఎలాంటి సంబంధం లేదు. కాని ఆయన మాటే అక్కడ శాసనం..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే గ్రామానికి చెందిన 50 మందికి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలిప్పించిన ఘనత ఆయనది. ప్రభుత్వంలో కీలక మంత్రికి ఆయన బినామీ. దీనికి తోడు కాలేజీలో పనిచేస్తున్న అధ్యాపకులు, సిబ్బంది కొందరు సహకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఎవరా ‘శక్తి’

ఇతను ఓ ఎన్నారై. ఆయన స్వగ్రామం కందుకూరు మండలం ఎడ్లూరుపాడు. ఒంగోలు నగరంలో ఓ జూనియర్‌ కాలేజీ కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంలో కీలకంగా ఉండే ఓ మంత్రికి ఆయన బినామీ అని ప్రచారం జరుగుతోంది. సదరు మంత్రి సాన్నిహిత్యంతోనే ట్రిపుల్‌ ఐటీ కళాశాల వ్యవహారాల్లో మితిమీరి జోక్యం చేసుకోవడమే కాకుండా కాలేజీ పెద్దలను సైతం మంత్రి పేరు చెప్పి బెదిరించి పెత్తనం చలాయిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

పచ్చదండు కన్ను...

ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ కాలేజీకి సంబంధించి క్యాంపస్‌–2, క్యాంపస్‌–3 ఒంగోలు నగరంలో ఉండగా, కడప ఆర్కే వ్యాలీలో క్యాంపస్‌–1 ఉంది. ఒంగోలు ఎస్‌ఎస్‌ఎన్‌ కాలేజీలో క్యాంపస్‌–2 నిర్వహిస్తుండగా, దక్షిణ బైపాస్‌లోని రావ్‌ అండ్‌ నాయుడు ఇంజినీరింగ్‌ కాలేజీలో క్యాంపస్‌–3 నడుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు ఈ కాలేజీపై కన్నేశారు. ఎలాగైనా సరే కాలేజీపై పెత్తనం కొనసాగించాలని ప్లాన్‌ చేశారు. ఇందులో భాగంగా ట్రిపుల్‌ ఐటీ కాలేజీకి సంబంధించి నగరంలోని రెండు క్యాంపస్‌లలో సుమారు 50 మంది టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి నోటిఫికేషన్లూ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా ఉద్యోగాలు ఇప్పించారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఒకే కులం, ఒకే గ్రామానికి ఉద్యోగాలు...

ట్రిపుల్‌ ఐటీ కాలేజీలో పనిచేస్తున్న అధ్యాపకులతో సదరు ఎన్నారైకి మంచి సంబంధాలు ఉన్నాయని తెలిసింది. వారంతా కూడా ఆయన సామాజికవర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. వారు ఆయనతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరితో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆయన స్వగ్రామానికి చెందిన 50 మందికి నిబంధనలు పాటించకుండా ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా ఉద్యోగాలు ఇప్పించినట్టు సమాచారం. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు లేకుండానే సదరు ఎన్నారై ద్వారా ఈ నియామకాలు జరిగినట్లు తెలుస్తుంది. సదరు మంత్రి ఆశీస్సులతోనే ఈ నియామకాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

ఫోర్జరీ సంతకాలతో జీతాలు...

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఎల్లో గ్యాంగ్‌ కాలేజీ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల ఒక మహిళా ఉద్యోగిని 20 రోజులకుపైగా విధులకు హాజరుకాకపోయినప్పటికీ రిజిస్టర్లో ఎల్లో గ్యాంగ్‌ సభ్యులే ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు సమాచారం. ఇదే కళాశాలలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి కూడా 15 రోజులకుపైగా గైర్హాజరైనప్పటికీ ఎల్లో ముఠా సభ్యులు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. విధులకు రాకుండానే జీతాలు తీసుకున్నట్లు సమాచారం. అంతేగాకుండా కాలేజీ సిబ్బంది సెలవు పెట్టాలన్నా, వ్యక్తిగత పనుల మీద క్యాంపస్‌ దాటి బయటకు వెళ్లాలన్నా డైరెక్టర్‌ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. కానీ, ఈ ఎల్లో గ్యాంగ్‌ ఉద్యోగులు మాత్రం డైరెక్టర్‌కు చెప్పాపెట్టకుండానే సెలవులు పెట్టడం, క్యాంపస్‌ నుంచి బయటకు వెళ్లి రావడం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, కాలేజీలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నట్లు సమాచారం.

చీటికీమాటికీ వారిమీదకు ఒంటి కాలితో వెళ్లడమే కాకుండా ‘రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలో ఉంది. మా వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు’ అంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు బడుగు బలహీన వర్గాలకు చెందిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాలేజీలో ఎల్లో గ్యాంగ్‌ డెన్‌...

ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా వీరిని కేర్‌ టేకర్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ఎలక్ట్రికల్‌ టెక్నీషియన్లు, ఐటీ టెక్నీషియన్లు, అటెండర్లు, సెక్యూరిటీ సిబ్బందిగా నియమించినట్లు చెబుతున్నారు. ఎగ్జామినేషన్‌ సెల్‌ పక్కనే ఉన్న ఒక గదిని వీరు డెన్‌గా ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. కాలేజీకి వచ్చి బయోమెట్రిక్‌ వేసి గదిలోకి వెళ్లిపోయి టైం పాస్‌ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎల్లో గ్యాంగ్‌ చేష్టలకు ట్రిపుల్‌ ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు భయపడి మిన్నకుండిపోతున్నట్లు తెలిసింది. వీరి ఆగడాలను తట్టుకోలేక కళాశాల నిర్వాహకుల దృష్టికి తీసుకువెళితే.. వారు సైతం తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement