No Headline
కొనకనమిట్ల: మొక్కవోని దీక్షతో ప్రకృతి సాగులో రాణిస్తూ వ్యవసాయానికి మహిళలు కూడా వెన్నెముకగా నిలుస్తారని నిరూపిస్తున్నారు ఆదర్శ మహిళా రైతు గుళ్లాపల్లి సుజాత. సమాజంలో లింగ వివక్ష, అసమానతలను నివారించినప్పుడే ప్రగతి సాధ్యమవుతుందనే సంకల్పంతో కాడి, మేడి పట్టిన ఈ లేడీ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. ప్రకృతి వ్యవసాయం చేయాలనే తలంపుతో కొనకనమిట్ల మండలం పెదారికట్ల గ్రామ సమీపంలో రాళ్లు రప్పలున్న 40 ఎకరాల భూమిని కొనుగోలు చేసి బిందు సేద్యంతో నేడు నవధాన్యాలు పండిస్తున్నారు. రసాయనిక అవశేషాలు లేని అన్ని రకాల ఆహార పంటలు పండిస్తున్నారు. అందరూ ఆరోగ్యకరమైన జీవనం సాగించేలా రైతులకు సాగులో మెళకువలు నేర్పిస్తున్నారు. వర్షాలపై ఆధారపడకుండా సోలార్ సిస్టం, డ్రిప్ సౌకర్యంతో నీటి తడులు అందిస్తూ ఏడాది పొడవునా రరకాల పంటలు పండిస్తున్నారు. పొలంలో సేద్యం, పురుగు మందుల పిచికారీ, విత్తనాల సాగును సులభంగా చేసేందుకు మెకానికల్ ఇంజనీర్ అయిన భర్త కోటేశ్వరరావు సహకారంతో మల్టీపర్పస్ రోబోను తయారు చేశారు. తాము పండించిన ఆహార ఉత్పత్తులను ‘విశ్వమాత ఫామ్స్’ పేరుతో దేశ, విదేశాల్లో మార్కెటింగ్ చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో మేటిగా నిలిచిన సుజాతను ప్రభుత్వం రైతు నేస్తం అవార్డుతో సత్కరించింది. 2021లో సాక్షి ఎక్సలెన్స్ అవార్డు, ముప్పవరపు ఫౌండేషన్ నుంచి ఉత్తమ రైతు అవార్డు, రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు నుంచి బయోడైవర్సిటీ కన్జర్వర్ అవార్డు తదితర పురస్కారాలు అందుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం గుంటూరు సమీపంలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఆర్.శారద, జయలక్ష్మి చేతుల మీదుగా సన్మానం, ప్రసంస పత్రం అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment