ఒంగోలు టాస్క్‌ఫోర్స్: కొద్ది రోజులుగా సింగరాయకొండ మండలంలో చర్చనీయాంశంగా మారిన క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో టీడీపీ వర్గీయులపై కేసులు నమోదయ్యాయి. గురువారం రాత్రి పిగిలి శివ, కేదారి రామకృష్ణ, నక్కా రమేష్, షేక్ నిస్సార్, షేక్ కరిముల్లా, రామారావు, సుబ్బారెడ్డి, ఎం.వెంకట్రావు, షేక్ యస్దాని, మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి స్టేషన్ బెయిలిచ్చి పంపించారు. కేసులు నమోదైన వారిలో పిగిలి శివ పాతసింగరాయకొండ పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడికి దగ్గర బంధువు. ఈ నాయకుడే క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ తన బంధువు శివను కూడా బుకీగా మార్చాడని ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. చుట్టుపక్కల మండలాల్లో కూడా ఇతని నెట్‌వర్క్ ఉందని, ఇటీవల కాలంలో ఇతని పేరుపై కొనుగోలు చేసిన స్థలాలు, మామిడితోటలు, ఇళ్లు ఇందుకు నిదర్శనమని జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేగాకుండా గతంలో బెట్టింగుల్లో డబ్బు పోగొట్టుకున్న గుంటూరు జిల్లాకు చెందిన వారు మురళితో పాటు శివపై కూడా ఫిర్యాదు చేశారని, ఆ కేసు గుంటూరు సీసీఎస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉందని సమాచారం. ఈ కేసులో ఉన్న టీడీపీ ముఖ్య నాయకుడు రామకృష్ణ మండల కేంద్రంలో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఆ రెస్టారెంట్ కేంద్రంగా క్రికెట్ బెట్టింగులు ఆడిస్తూ మద్యం అమ్మకాలు సాగిస్తున్నాడని సమాచారం. అయితే, టీడీపీ వారు కొద్దిరోజులుగా ఈ కేసును పక్కదారి పట్టించేందుకు పచ్చపత్రికల్లో వైఎస్సార్ సీపీకి చెందినవారే బెట్టింగులకు పాల్పడుతున్నారంటూ దుష్ప్రచారం చేశారు. శానంపూడిలో ఎంఎల్‌హెచ్‌పీగా పనిచేస్తున్న వ్యక్తి రైలు కిందపడి చనిపోయిన ఘటన, పాకలకు చెందిన యువకుడు రైలు పట్టాల కిందపడి చనిపోయిన ఘటన, వ్యవసాయశాఖలో పనిచేసే అధికారి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయిన ఘటనకు టీడీపీ మద్దతుదారులైన బుకీలే కారణమని తెలుస్తోంది. ఇటీవల బాలయోగినగర్‌కు చెందిన యువకుడు పందెంలో రూ.4 లక్షలు గెలుచుకున్నాడు. కానీ, అతనికి బుకీలు రూ.లక్ష మాత్రమే ఇచ్చి మళ్లీ అతనిచేత బెట్టింగు ఆడించి ఆ రూ.3 లక్షలు స్వాహా చేశారని, అలాగే కలికవాయకు చెందిన యువకుడు సుమారు రూ.50 లక్షల వరకు బెట్టింగులో పోగొట్టుకున్నాడని సమాచారం. ఈ బెట్టింగ్ వ్యవహారం జరుగుమల్లి మండలం పైడిపాడు గ్రామానికి చెందినది కాగా, తీగలాగితే డొంక కదిలినట్లు మండలంలో బెట్టింగ్ వ్యవహారం మొత్తం బయటపడింది. క్రికెట్ బుకీలు గురువారం రాత్రి స్టేషన్ బెయిల్ తీసుకుని వచ్చిన తర్వాత వారి అడ్డా అయిన కందుకూరు ఫ్‌లైఓవర్ సెంటర్‌లో సమావేశమైనట్లు తెలిసింది.
నిందితులు వైఎస్సార్ సీపీ
సానుభూతిపరులంటూ వారం
రోజులుగా పచ్చపత్రికల దుష్ప్రచారం
Comments
Please login to add a commentAdd a comment