ఒట్టిమాటలు..
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025
తల్లికి వందనం..ఉచిత బస్సు ప్రయాణం..మహిళలకు నెలకు రూ.1500 ఇలా సూపర్ సిక్స్‌లో మహిళల కోసం చెప్పిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా దగాచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకవైపు మహిళలను మోసం చేస్తూనే మరోవైపు ఇంకా వారిని భ్రమల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేడు మార్కాపురంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్నారు. చంద్రబాబు పర్యటనను జిల్లాలోని మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒట్టిమాటలు చెప్పడం మానేసి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.
మెడి‘కలే’నా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ఒంగోలు టౌన్:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలతో మహిళా సంక్షేమం తీసుకొస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఊరువాడా హోరెత్తించారు. మాయమాటలు చెప్పి ఓట్లేయించుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత తల్లికి వందనానికి ఎగనామం పెట్టారు. ఉచిత బస్సు ఊసే మరిచారు. మూడు సిలిండర్లకు కోతలు పెట్టారు. చేసిన హామీలన్నిటినీ అటకెక్కించారు. కాపురాలు కూల్చి మహిళల కాపురాల్లో చిచ్చుపెట్టే మద్యం వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఊరూరికి మద్యం సరఫరా చేస్తూ మహిళలపై హింసను రాజేస్తూ నాయకుల సంపద పెంచే పనిలో పడ్డారు.
తల్లికి వందనానికి తొలి ఏడాదే ఎగనామం:
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమ్మ ఒడి పేరుతో ఏడాదికి రూ.15 వేల చొప్పున అందించారు. 2019 నుంచి క్రమం తప్పకుండా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. జిల్లాలో మొత్తం రూ.1358 కోట్లను తల్లుల ఖాతాలో జమచేశారు. కానీ ఇందుకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం తొలి ఏడాదే తల్లికి వందనం పథకానికి ఎగనామం పెట్టింది. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున అందిస్తామని చెప్పిన చంద్రబాబు అండ్ కో ఇచ్చిన మాట తప్పి తొలి ఏడాదే తల్లులను మోసం చేసిందని మహిళలు మండిపడుతున్నారు. జిల్లాలో 1 నుంచి 6వ తరగతి వరకు 96,258 మంది విద్యార్థులుండగా, 6 నుంచి 9వ తరగతి వరకు 94,362 మంది ఉన్నారు. ఇక 29,603 మంది పదో తరగతి, 43,441 మంది ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. మొత్తం మీద 2,63,664 మంది విద్యార్థులకు గాను ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున రూ.395 కోట్ల 49 లక్షల 60 వేలను కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టిందని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ ఏడాది పథకాన్ని అమలు చేస్తానని చెబుతున్నా బడ్జెట్లో అరకొర నిధులను కేటాయించడంతో ఎన్ని కోతలు పెడతారోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
షరతులతో ఉచిత బస్సు...
రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం అధ్యయనం పేరిట కాలయాపన చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2025–26 బడ్జెట్లో కూడా దీనికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణానికి పరిమితులు విధిస్తూ కేవలం జిల్లాలోపు మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారని చెబుతున్నారు. ఈ పరిమితులపై మహిళలు మండిపడుతున్నారు. జిల్లాలో 13 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణంపై ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఏడాదికి ఒక్క గ్యాస్ సిలిండరే...
ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటూ కూటమి నాయకులు హామీ ఇచ్చారు. గత ఏడాది దీపావళి రోజు దీపం 2.0 పథకాన్ని ప్రారంభించారు. అయితే గత ఏడాది కేవలం ఒక్క గ్యాస్ సిలిండర్ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అది కూడా నామమాత్రంగా అమలు చేస్తుండడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 49 గ్యాస్ ఏజన్సీల ద్వారా వంటగ్యాస్ సరఫరా చేస్తారు. జిల్లాలో 3,26,865 ఐఓసీ కనెక్షన్లు ఉన్నాయి. 1,57,202 హెచ్‌పీ కనెక్షన్లు, 2,16,323 బీఈసీ కనెక్షన్లు ఉన్నాయి. మొత్తం 7.39 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. దీపం 2.0 పథకం ప్రారంభోత్సవం సమయంలో జిల్లాలో 4,80,711 మంది లబ్ధిదారులు ఉన్నట్లు అధికారులు చెప్పడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే మిగతా 2.60 లక్షల మందికి ఉచిత గ్యాస్ లేనట్టేనని చెప్పవచ్చు. ప్రభుత్వం కేటాయించిన నిధుల ప్రకారం చూస్తే సగానికి సగం మందికి కూడా ఉచిత గ్యాస్‌కు సంబంధించిన నగదు జమ కావట్లేదు.
నెలకు రూ.1500 పథకం ఊసే లేదు:
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 55 ఏళ్లు దాటిన మహిళలకు ఏడాదికి రూ.18 వేలు ఇచ్చారు. అదే పథకానికి రంగుపూసిన చంద్రబాబు 19 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ పథకం గురించి ఇప్పుడు అస్సలు మాట్లాడడం లేదు. జిల్లాలో 7.80 లక్షల మంది 19 నుంచి 45 ఏళ్ల వయసు కలిగిన మహిళలున్నారు. 5.2 లక్షల మంది 45 పైబడిన వయసు కలిగిన మహిళలున్నారు. వీరంతా నెలకు రూ.1500 వస్తాయి కదా అనుకొని ఆశ పడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో మండిపడుతున్నారు.
మద్యంతో మహిళలపై పెరిగిన హింస...
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు సంక్షేమాన్ని విస్మరించి టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులకు సంపద సృష్టించి ఇవ్వాలన్న తపనతో మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. జిల్లాలో 171 మద్యం దుకాణాలను కేటాయించగా, 2500కు పైగా బెల్టు దుకాణాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారు. జిల్లాలో గుక్కెడు మంచినీళ్లు దొరకడం లేదు కానీ కావలసినంత మద్యం మాత్రం దొరకుతోంది. దీంతో గ్రామాల్లో మందుబాబుల సంఖ్య బాగా పెరిగింది. తప్పతాగి ఇంటికెళ్లి భార్యాబిడ్డలను వేధిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం ప్రభావం ఎక్కువగా మహిళలపై ఉందని, ఇటీవల మహిళలపై హింస బాగా పెరిగిపోయిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
మార్కాపురం పట్టణం వ్యూ
నిలిచిన మార్కాపురం మెడికల్ కళాశాల భవనం
హామీలు అమలు చేయకుండా మహిళలను వంచించిన చంద్రబాబు తొలి ఏడాది తల్లికి వందనానికి ఎగనామం మహిళలకు ఉచిత బస్సుపైనా కాలయాపన 18 ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు రూ.1500 ఊసే లేదు 45 ఏళ్లు నిండిన మహిళలకు రూ.20 వేలు ఇస్తామన్న హామీకి మంగళం ఏడాదికి మూడు సిలిండర్లంటూ తొలి ఏడాది ఒక్క సిలిండర్‌తో సరి విచ్చలవిడి మద్యం వ్యాపారంతో మహిళలపై పెరిగిన వేధింపులు
మార్కాపురం జిల్లా ఏర్పాటయ్యేనా..?
మార్కాపురం: కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు కావస్తున్నా మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించకపోవడంతో ఈ ప్రాంత ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అధికారంలోకి రాగానే జిల్లా ఏర్పాటు చేస్తామని నాటి ఎన్నికల సభలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, లోకేష్ హామీ ఇచ్చారు. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి, కనిగిరి ప్రాంతాలను కలుపుతూ జిల్లా ఏర్పాటు చేయడంతో పాటు కందుకూరు, అద్దంకి ప్రాంతాలను ఒంగోలులో కలుపుతామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా ఏర్పాటుపై ప్రకటన చేస్తారని ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసేందుకు అన్నీ అర్హతలు ఉన్నాయి. మార్కాపురంలోనే సబ్‌కలెక్టర్, డీఎస్‌పీతోపాటు గతంలో అదనపు ఎస్‌పీ స్థాయి అధికారిని ఓఎస్‌డీగా నియమించారు. మార్కాపురంలో జిల్లా ఆరో దనపు కోర్టు, ఆకాశవాణి కేంద్రం, ఎకై ్సజ్ కార్యాలయాలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్‌టీ కార్యాలయాలు ఉన్నాయి. మార్కాపురం రైల్వేస్టేషన్ రోడ్, మెడికల్ కాలేజీ, జీజీహెచ్, వీటితో పాటు నాలుగు ఇంజినీరింగ్ కళాశాలలు, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, లా, అగ్రికల్చర్, హార్టీకల్చర్ కాలేజీ తదితర విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. జిల్లా కేంద్రం ఏర్పాటైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి వచ్చే నిధులు మార్కాపురానికి వస్తాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు వెళ్లాలంటే పుల్లలచెరువు నుంచి 170 కిలోమీటర్లు, గిద్దలూరు నుంచి 150 కిలోమీటర్లు, దోర్నాల నుంచి 130 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది.
మార్కాపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మార్కాపురంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. కాలేజీ నిర్మాణ పనులు యధావిధిగా జరిగి ఉంటే ఈ ఏడాది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ప్రవేశాలు ప్రారంభమై ఉండేవి. పశ్చిమ ప్రకాశంలోని సుమారు 8 లక్షల మంది ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్కాపురానికి సుమారు రూ.475 కోట్లతో మెడికల్ కళాశాల మంజూరు చేశారు. పనులు కూడా దాదాపు 75 శాతం పూర్తయ్యాయి. జిల్లా వైద్యశాలను జీజీహెచ్‌గా మార్చడంతోపాటు 450 బెడ్లు ఏర్పాటుచేసి, 82 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంటు ప్రొఫెసర్లు, డాక్టర్లు అందుబాటులో ఉంచారు. దీంతో రోజుకు సుమారు 750 నుంచి 800 మంది పేషంట్లు వైద్యసేవలు పొందేవారు. 3 ఆక్సిజన్ ప్లాంట్లు, ఐసీయూ యూనిట్, వెంటిలేటర్ సౌకర్యాలు కూడా కల్పించారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం అసంపూర్తి భవనాలంటూ నిలిపేయడంతో పాటు జీజీహెచ్‌లో ఉన్న సుమారు 40 మంది వైద్యులని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది. దీంతో వైద్యసేవలు తగ్గిపోయాయి. పశ్చిమ ప్రకాశంలో సుమారు 72 చెంచుగూడేలు ఉన్నాయి. వీరందరికీ కార్పొరేట్ వైద్యం అందాలంటే మార్కాపురం వచ్చి అక్కడి నుంచి కర్నూలు, గుంటూరు వెళ్లాల్సి వస్తోంది. నూతనంగా వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని మెడికల్ కళాశాలను గుజరాత్ తరహాలో పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు పార్టనర్‌షిప్) విధానంలో చేపట్టే ప్రతిపాదనలు చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రైవేటు వ్యక్తుల నియంత్రణలో వైద్యసేవలు అందుతాయి. దీనిపై జనం భగ్గుమంటున్నారు.
త్వరగా మార్కాపురం జిల్లాఏర్పాటు చేయాలి
పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాల కోరిక అయిన మార్కాపురం జిల్లా ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్వరగా నిర్ణయం తీసుకోవాలి. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్కాపురం వచ్చినప్పుడు మార్కాపురం కేంద్రంగా జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
– పత్తి రవిచంద్ర, వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి
మెడికల్ కళాశాల పూర్తిచేసి అడ్మిషన్లు ప్రారంభించాలి
అర్ధాంతరంగా నిలిపేసిన మెడికల్ కళాశాల భవన నిర్మాణాలు పూర్తిచేసి అడ్మిషన్లు వెంటనే ప్రారంభించాలి. వెనుకబడిన ప్రాంత విద్యార్థులు ఎంబీబీఎస్ చదవాలంటే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. మెడికల్ కళాశాల పూర్తిచేసి ప్రారంభిస్తే ఈప్రాంత విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుంది. మెడికల్ కళాశాల నిర్వహణ ప్రైవేటుపరం చేయకుండా ప్రభుత్వమే నిర్మించాలి.
– అందె నాసరయ్య, సీపీఐ ఏరియా కార్యదర్శి, మార్కాపురం
ఒట్టిమాటలు..
ఒట్టిమాటలు..
ఒట్టిమాటలు..
ఒట్టిమాటలు..
Comments
Please login to add a commentAdd a comment