వైఎస్సార్ విగ్రహంపై దాడి తగదు
ఒంగోలు సిటీ: ఒంగోలు నగరంలోని మామిడిపాలెంలో రెడ్డి హాస్టల్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం, అవమాన పరచడం మంచి పద్ధతి కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి హెచ్చరించారు. ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ విగ్రహాన్ని అవమానపరిచిన వారిపై పోలీసులు తక్షణమే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం అయ్యే అవకాశం ఉందన్నారు. అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు ఉంటే ఇంటి దగ్గర తేల్చుకోవాలని ఇలా రోడ్ల మీద పడి రచ్చ చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఒంగోలు నగర ప్రజలు ఇలాంటి తప్పుడు సంస్కృతిని అంగీకరించరని చెప్పారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా ఎవరు ప్రయత్నించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలందరి ప్రాణాలను కాపాడడానికి 108 అంబులెన్స్‌లు, నిరుపేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ, పేదరికం కారణంగా చదవులు ఆగిపోకుండా ఫీజురీయింబర్స్‌మెంట్ తీసుకొచ్చిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. ఈవీఎంలు, అసత్య ఆరోపణలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందే తప్ప రాష్ట్రంలో ఇప్పటికీ టీడీపీ, జనసేన కంటే బలంగా ఉందని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ అని, ప్రజలే మా నాయకులు అని స్పష్టం చేశారు. ఇది ఎవరి నుంచో లాక్కున్న పార్టీ కాదని, ఒక నాయకుడి పోరాట పటిమతో పురుడు పోసుకున్న పార్టీ అని చెప్పారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని లక్షలాది ప్రజలకు సాగు, తాగునీరు అందించే వెలుగొండ ప్రాజెక్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే 90 శాతం వరకు పూర్తయిందన్నారు. కేవలం ఆర్‌ఆర్ ప్యాకేజీలు ఇచ్చి చిన్న చిన్న పనులు చేస్తే మిగిలిన ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టుకు అరకొర నిధులు కేటాయించడానికి వ్యతిరేకంగా యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పాదయాత్ర చేయనున్నట్లు అసెంబ్లీలోనే ప్రకటించారని, పాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన వెంట నడుస్తాయని చెప్పారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి ఇక్కడ ఎవరూ భయపడటం లేదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టాలంటే ఎక్కువ రోజులు సాధ్యం కాదన్నారు. కూటమి నాయకులు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఎంపీ అభ్యర్థికి ఆరున్నర లక్షలకు పైగా ఓట్లు వచ్చాయని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా మా ఓట్లు ఏమైపోయాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఆయన వెంట ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు నటారు జనార్ధనరెడ్డి, పిగిలి శ్రీను, హౌసింగ్ చిన్న, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment