బాబు పాలనలో అడుగడుగునా వంచనే..
మద్దిపాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనలో మోసం, వంచనలే ఉంటాయని మాజీ మంత్రి, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ మేరుగు నాగార్జున అన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన సోమవారం కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. యువతకు లక్షలాది ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఉద్యోగం లేని యువకులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని మోసపూరితమైన వాగ్దానాలు చేశారని, పదవి వచ్చిన తర్వాత ఆ హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి వసతి దీవెనకు సంబంధించి రూ.4600 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా ఇంతవరకు దాని ఊసే ఎత్తడం లేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే అందులో ఐదు కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమైన దశలో మొత్తం మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని అన్నారు. జగన్‌మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను రద్దు చేయొద్దని, పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడానికి కళాశాలలను ప్రభుత్వమే నడిపించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి వంటి పథకాలను పూర్తిగా ఎత్తివేయడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు రైతులు మద్దతు ధర లేక విలవిలాడిపోతున్నారన్నారు. మిర్చి పంట వేసిన రైతులకు గతంలో క్వింటా రూ.28 వేల వరకు ధర వస్తే ప్రస్తుతం చంద్రబాబు ధర విషయంలో కేంద్రం రూ.11 వేలు ఇస్తుంది అని చెప్పి తప్పుకున్నారన్నారు. పత్తి, వరి రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. రైతులు, విద్యార్థులు, యువకులు ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 12న శ్రీయువత పోరు’ కార్యక్రమం చేపట్టామని, యువతకు సంబంధించిన పలు విషయాలపై కలెక్టర్‌కు మెమొరాండం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ తరలిరావాలని, సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లేలా కార్యక్రమం నిర్వహించుకోవాలని కోరారు. ముందుగా ఆయన ‘యువత పోరు’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు దుంపా చెంచిరెడ్డి, పోలవరపు శ్రీమన్నారాయణ, మద్దిపాడు మండల పార్టీ కార్యదర్శి వాక కోటిరెడ్డి, పైనం ప్రభాకర్, పైడిపాటి వెంకట్రావు, నాదెండ్ల నాదెండ్ల మహేష్, రామాంజనేయులు, పల్లపాటి అన్వేష్ ,దుడ్డు వినోద్, సురేష్, సుబ్బారావు, అనిల్ శ్రీనివాసరావు, పాల్గొన్నారు.
మాజీ మంత్రి మేరుగు నాగార్జున
Comments
Please login to add a commentAdd a comment