
చందురి(వేములవాడ): పక్కా ప్లాన్.. పది రోజుల్లో పని పూర్తి.. హత్య చేసిన రోజే దుబాయికి పరారీ అయిన నిందితుడు. ఇదీ చందుర్తి మండలం మల్యాలలో వివాహేతర సంబంధంలో యువకుడిని హత్యకు ప్లాన్. గ్రామానికి చెందిన పడిగెల నరేశ్‌ను వివాహేతర సంబంధంలో హత్యకు గురైన విషయం తెలిసింది. నరేశ్ గత నెల 29న మల్యాల గ్రామానికి దుబాయ్ నుంచి చేరుకోగా.. ఆమె భర్త మల్లేశం ఈనెల 3న ఇండియాకు వచ్చాడు. ఈ విషయం భార్యకు తెలువకుండా జాగ్రత్తపడి బంధువుల ఇంట్లో ఉండి హత్యకు పథకం రచించాడు.
పది రోజుల్లో పని పూర్తి చేసుకోవాలనుకున్న మల్లేశం అనుకున్నట్లే అన్ని అమలు చేశాడు. ఈనెల 13వ తేదీ రాత్రి 10.25 గంటల నుంచి 10.40 గంటల మధ్య భార్య వద్దకు వెళ్లిన నరేశ్‌ను హతమార్చి బైక్‌పై పరారయ్యాడు. హత్య విషయం ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే సమయానికే ప్రధాన నిందితుతు జిల్లా దాటిపోయినట్లు సమాచారం. పోలీసులు స్పందించి లుక్‌ఔట్ నోటీస్‌లు ఇచ్చేలోపే మల్లేశం దేశం దాటిపోయాడని తెలుస్తోంది.
పోలీసుల ముమ్మర విచారణ
మల్లేశంను హైదరాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఎవరు తరలించారన్నది పోలీసులకు అంతుచిక్కడం లేదు. హత్య చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఏ వాహనంలో వెళ్లాడనే దానిపై ఆరా తీస్తున్నారు. అతనికి ఎవరెవరూ సహకరించారన్న కోణంలో పోలీసుల విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ హత్యతో నలుగురికి సంబంధం ఉందని భావించిన పోలీసులకు మల్లేశం దుబాయ్ చేరుకున్న విషయాన్ని సవాల్‌గా తీసుకున్నారు. ఈ కేసులో ప్రశ్నార్థకంగా మారిన చిక్కుముడులను విప్పేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.