కూలర్లు ఏర్పాటు చేయండి | Sakshi
Sakshi News home page

కూలర్లు ఏర్పాటు చేయండి

Published Tue, May 7 2024 1:00 AM

కూలర్లు ఏర్పాటు చేయండి

సిరిసిల్ల: పార్లమెంట్‌ ఎన్నికల విధులు కట్టదిట్టంగా నిర్వహించాలని, పోలింగ్‌ కేంద్రాల్లో వేసవి దృష్ట్యా కూలర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం సెక్టోరియల్‌ అధికారులు, ఎంపీడీవోలతో ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌కు సరిగ్గా వారం రోజుల గడువు మాత్రమే ఉందని, ఓటర్‌ జాబితా ప్రకారం ప్రతీ ఓటర్‌కు బూత్‌స్థాయి అధికారుల ద్వారా ఓటర్‌ స్లిప్పులు పంపిణీ చేయాలని సూచించారు. ఇటీవల మరణించిన వారి వివరాలు పంచాయతీ కార్యదర్శి ద్వారా సేకరించి జాబితా నుంచి తొలగించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాలను ఎంపీడీవోలు పరిశీలించి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. పోలింగ్‌ కేంద్రం వద్ద తాగునీరు, టాయిలెట్లు, నీడ ఉండేలా టెంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మన జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, అమ్మ అభివృద్ధి కమిటీల ద్వారా చేపట్టిన పనులు పోలింగ్‌ రోజుకు ముందే ముగిసేలా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీవోలకు కేటాయించిన ప్రత్యేక నిధులతో పోలింగ్‌ కేంద్రాల వద్ద కూలర్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి

అసెంబ్లీ సెగ్మెంట్‌లలో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలు, రిసెప్షన్‌ కేంద్రాల వద్ద సంబంధిత పోలింగ్‌ బృందాలకు సరైన పోలింగ్‌ సామగ్రి చేరేలా ఏర్పాట్లు చేయాలని, కేంద్రాలకు పోలింగ్‌ సామగ్రి తరలించేందుకు వాహనాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పోలింగ్‌ సిబ్బంది, బూత్‌ స్థాయి అధికారి వద్ద అవసరమైన మేరకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో పెట్టాలని తెలిపారు. పోలింగ్‌ సకాలంలో ప్రారంభించాలని, ప్రతీ 2 గంటలకు పోలింగ్‌ వివరాలు రిపోర్ట్‌ చేయాలన్నారు. ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే సెక్టార్‌ అధికారుల దృష్టికి తేవాలని, రిజర్వ్‌ ఈవీఎంలు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్‌ తరువాత 17సీ రిజిస్టర్‌, ఫారంపై ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని తెలిపారు. సిరిసిల్ల సహాయ రిటర్నింగ్‌ అధికారి పూజారి గౌతమి, ఆర్డీవో రమేశ్‌, సెక్టార్‌ అధికారులు, సీపీవో శ్రీనివాసాచారి, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు శ్రీకాంత్‌, ఏవో రాంరెడ్డి పాల్గొన్నారు.

ఎన్నికల విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలి

కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

ఎన్నికల నిర్వహణపై సమీక్ష

Advertisement
 
Advertisement