మొక్కులు తీర్చే బుగ్గరాజేశ్వరస్వామి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): భక్తుల కొంగుబంగారంగా నిలుస్తున్నాడు ఎల్లారెడ్డిపేట మండలం అక్కపెల్లి గ్రామంలోని బుగ్గరాజేశ్వరస్వామి. ఇక్కడే ఏడాదంతా సహజసిద్ధంగా నీరు ఉబికి వస్తుంటుంది. ఈ నీటి కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ గుండాన్ని ఏర్పాటు చేశారు. ఏటా మాఘ అమావాస్య రోజున ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. సిరిసిల్ల ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడిపిస్తుంటారు. ఇప్పటికే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అలాగే ఎల్లారెడ్డిపేటలోని శ్రీకేశవపెరుమాండ్ల ఆంజనేయస్వామి ఆలయ గుట్టపై మాఘ అమావాస్య జాతరకు ఏర్పాట్లు చేశారు. రాచర్లగొల్లపల్లి, నారాయణపూర్ శివారులోని మానేరువాగులోని ఆంజనేయస్వామి ఆలయాల వద్ద జాతర నిర్వహిస్తుంటారు.
స్వయంభూ శ్రీలక్ష్మీనరసింహస్వామి
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ మండలం చీకోడులోని స్వయంభూ శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. ఈనెల 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు వేడుకలు నిర్వహించనున్నారు. ఆలయానికి రంగులు వేశారు. భక్తులకు తాగునీటి వసతి కల్పించారు. 28న స్వామివారి ఊరేగింపు, తిరుకల్యాణం, 29న అభిషేకం, సహస్ర నామార్చన, గిరిప్రదర్శన(ఎడ్ల బండ్లు తిరుగుట), 30న రథోత్సవం, జాతర ఉంటాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. రామలక్ష్మణపల్లె శ్రీరామాలయం, పోతుగల్‌లో శ్రీరామాలయం, ముస్తాబాద్‌లో శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాల్లో జాతర ఉత్సవాలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment