గుడుంబా అమ్మితే జైలుకే..
● పూచీకత్తును ఉల్లంఘిస్తే జరిమానా, జైలు
● రెండేళ్లలో రూ.15.86లక్షల జరిమానాలు చెల్లింపు
● బైండోవర్లను తేలిగ్గా తీసుకుంటే కటకటాల్లోకే..
● జిల్లాలో 2021 మంది బైండోవర్
● అయినా ఆగని గుడుంబా విక్రయాలు
● నేరస్తులపై ప్రత్యేక నిఘా
● తాజాగా రూ.లక్ష పూచీకత్తుపై 10మంది బైండోవర్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గిరిజనులు ప్రత్యామ్నాయ ఉపాధిగా ఎంచుకున్న గుడుంబా తయారీ.. వారిని జైలుపాలు చేస్తుంది. అక్షర జ్ఞానం.. అవగాహన లేకపోవడంతో గుడుంబా విక్రయిస్తూ కటకటాల పాలవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుడుంబా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతుండడంతో ఇటీవల జైలుకు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. బైండోవర్ నిబంధనలు తెలియక కొందరు పదే..పదే అదే తప్పు చేస్తూ జైలుపాలవుతున్నారు.
పెరిగిన బైండోవర్‌లు
ఐదు రోజుల వ్యవధిలో ఎల్లారెడ్డిపేట ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో 10 మందిని బైండోవర్ చేయడంతోపాటు ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో రెండేళ్లలో 2,021 మంది నాటుసారా తయారీ, విక్రయదార్లను ఎకై ్సజ్ అధికారులు బైండోవర్ చేశారు. బైండోవర్ సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.లక్ష పూచీకత్తు లేక జైలు శిక్ష అనే షరతులు విధించి వదిలేస్తారు. ఈ షరుతులను ఉల్లంఘించిన ఐదుగురికి జైలు శిక్ష విధించగా జైలుకు వెళ్లకుండా జరిమానాలు చెల్లించి బయటకొచ్చారు. తాజాగా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామానికి చెందిన ఇద్దరు బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించగా.. ఓ మహిళ రూ.లక్ష జరిమానా చెల్లించి బయటకొచ్చింది. మరొకరు జైలుకు వెళ్లారు. ఇలా నాటుసారా దందా చేస్తూ పట్టుబడ్డ చాలా మంది నుంచి ఎకై ్సజ్ అధికారులు జరిమానాలు వసూలు చేస్తున్నా దందాకు మాత్రం బ్రేక్ పడడం లేదు.
నిబంధనలు కఠినతరం
జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, వేములవాడ, కోనరావుపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాల్లో గుడుంబా విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. ఆయా మండలాల్లో ఎక్సైజ్ అధికారులు పెద్ద ఎత్తున బైండోవర్లు చేస్తున్నారు. మొదటి రెండు తప్పులతో బైండోవర్ అయిన వారు తిరిగి సారా, గంజాయి విక్రయించడం లాంటి సంఘటనల్లో పట్టుబడితే ఏడాది జైలు లేక రూ.లక్ష జరిమానా విధిస్తున్నారు. జిల్లాలోని 8 మండలాల్లో 2025 మందిని బైండోవర్ చేశారు. ఇందులో ఐదుగురు తిరిగి నేరాలకు పాల్పడడంతో జైలుశిక్ష, జరిమానా విధించారు. గతంలో ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామానికి చెందిన ఓ మహిళతోపాటు ఓ గిరిజనుడు బైండోవర్ తర్వాత గుడుంబా అమ్ముతూ పట్టుబడగా వారిద్ది రికీ జైలుశిక్ష విధించారు. మహిళా మాత్రం రూ.లక్ష జరిమానా చెల్లించి జైలు నుంచి విడుదలైంది.
అందని ప్రభుత్వ సాయం
జిల్లాలో నాటుసారా, గుడుంబా తయారీ, విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం గత 2016 అక్టోబర్‌లో పునరావాస ప్యాకేజీని ప్రకటించింది. ప్రభుత్వం ముందుచూపుగా రాష్ట్రాన్ని గుడుంబా రహితంగా మార్చాలనే సంకల్పంతో పునరావాసం పథకం ప్రవేశపెట్టగా కాలక్రమంలో అది అమలుకు నోచుకోవడం లేదు. మొదటి విడతగా జిల్లాలో 56 మందికి ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున రుణం అందజేసింది. అప్పటి వరకు గంజాయి అమ్మిన వారు ప్రభుత్వం అందించిన సాయంతో కిరాణం, టెంట్‌హౌస్‌లు, డైయిరీ లాంటివి ఏర్పాటు చేసుకుని వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ పథకం నిలిచిపోవడంతో మళ్లి అనేక మంది సారా తయారీ, అమ్మకాలపై దృష్టి సారించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరావాస పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.
ఈ చిత్రంలో కనిసిస్తున్న వారంతా నాటుసారా తయారుచేసి విక్రయిస్తూ అధికారులకు పట్టుబడ్డారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ తండాలకు చెందిన 10 మందిని రూ.లక్ష సొంత పూచీకత్తుపై గత సోమవారం ఎకై ్సజ్ అధికారులు ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ఎన్నిసార్లు పోలీసులకు పట్టుబడ్డ గిరిజనులు మాత్రం సారా తయారీని విడిచిపెట్టడం లేదు.
బైండోవర్ల వివరాలు
ఎకై ్సజ్ స్టేషన్ బైండోవర్లు ఉల్లంఘనలు జరిమానాలు
సిరిసిల్ల 525 01 రూ.25వేలు
ఎల్లారెడ్డిపేట 1,070 41 రూ.13.86లక్షలు
వేములవాడ 430 07 రూ.1.75లక్షలు
ఉపాధి కల్పించాలి..
ప్రభుత్వం నిరుపేద గిరిజనులకు ఉపాధి కల్పించాలి. చేతినిండా పని ఉంటే గుడుంబా జోలికి వెళ్లే అవసరం ఉండదు. సారా కేసుల్లో పట్టుకున్న వారిని బైండోవర్ చేస్తూ మళ్లీ దొరికితే జైలుకు పంపుతున్నారు. పూట గడవడమే కష్టంగా ఉన్న వారు రూ.లక్ష జరిమానా చెల్లించలేక ఏడాది జైలుశిక్ష అనుభవిస్తున్నారు. దీంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. – భూక్య ఈరవ్వ, రాజన్నపేట
బైండోవర్లను ఆషామాషీగా తీసుకోవద్దు
జిల్లాలో చాలా మంది గుడుంబా అమ్మకం, తయారీదారులను బైండోవర్లు చేస్తున్నాం. బైండోవర్లను కొంతమంది ఆషామాషీగా తీసుకుంటున్నారు. ఇలా అనేక మంది జైలుకు వెళ్లడం, జరిమానాలు కట్టడం జరుగుతోంది. తహసీల్దార్‌ల ముందు బైండోవర్లను సీరియస్‌గా తీసుకోవాలి. గుడుంబా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం.
– శ్రీనివాస్, ఎకై ్సజ్ సీఐ, ఎల్లారెడ్డిపేట
Comments
Please login to add a commentAdd a comment