
రైతు సంక్షేమం పట్టని ప్రభుత్వం
షాద్‌నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాల పూర్తయిన సందర్భంగా హనుమకొండలో నిర్వహించే రజతోత్సవ మహాసభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను గురువారం షాద్‌నగర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బీళ్లుగా మారిన పంట పొలాలను నాడు కేసీఆర్ సస్యశ్యామలం చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కరువు తాండవిస్తోందని, కాంగ్రెస్ పాలనలో తిరిగి పాత రోజులు వస్తాయేమోనని ప్రజలు భయపడుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పిన మాయమాటలకు మోసపోయి, భ్రమపడి ఆ పార్టీకి ఓటు వేశారన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను విస్మరించిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతల మాటలకు మోసపోయామని ప్రజలు ఎంతో బాధపడుతున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కేసులకు భయపడేది లేదని, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈనెల 27న బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని, భారీ ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు కొందూటి నరేందర్, ఈట గణేశ్, రాజావరప్రసాద్, వంకాయల నారాయణరెడ్డి, కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్, యుగేంధర్, ఒగ్గు కిషోర్, వెంకట్‌రాంరెడ్డి, ఎంఎస్ నట్‌రాజ్, బచ్చలి నర్సింహ పాల్గొన్నారు.
మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్