
మామిడి రైతుల ప్రయోజనాలే ముఖ్యం
అబ్దుల్లాపూర్‌మెట్: పండ్ల మార్కెట్‌కు వచ్చే మామిడి రైతులకు గిట్టుబాటు ధర అందిస్తూ వారి ప్రయోజనాల కోసమే మార్కెట్ కమిటీ పనిచేస్తోందని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. మామిడి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో బాటసింగారం పండ్ల మార్కెట్‌లో జరుగుతున్న మామిడి పండ్ల క్రయవిక్రయాలను గురువారం పాలకవర్గం సభ్యులు, అధికారులతో కలిసి చైర్మన్ మధుసూదన్‌రెడ్డి పరిశీలించారు. మామిడి మార్కెట్ యార్డు మొత్తం తిరిగి రైతుల సమస్యలు, క్రయవిక్రయాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌కి వచ్చిన రైతుల సమస్యలు తెలుసుకొని వారి సలహాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది కంటే ఈ సంవత్సరం మామిడి దిగుబడి అధికంగా ఉందని, మార్కెట్‌కి వచ్చే రైతులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. రైతులకు మంచి గిట్టుబాటు అందించేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. రోజుకు 800 వాహనాలు మార్కెట్‌కి వస్తున్న తరుణంలో ట్రాఫిక్‌కి ఇబ్బంది కలగాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కరాచారి, మార్కెట్ సెక్రటరీ ఎల్.శ్రీనివాస్, డైరెక్టర్లు బండి మధుసూదన్ రావు, అంజయ్య, నవరాజ్, రఘుపతి రెడ్డి, నరసింహ, జైపాల్ రెడ్డి, మచ్చేందర్ రెడ్డి, గణేశ్‌నాయక్, వెంకటేశం గుప్తా, ఇబ్రహీం పాల్గొన్నారు.
మతోన్మాదం నుంచి
ప్రజలను కాపాడుకోవాలి
షాబాద్: మతోన్మాదం నుంచి ప్రజలను, బీజేపీ నుంచి దేశాన్ని కాపాడుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పేర్కొన్నారు. పార్టీ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద చేపట్టిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామికవాదులు, ప్రశ్నించే నాయకుల మీద దాడులు.. హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలను సంప్రదించకుండానే వక్ఫ్‌బోర్డు చట్ట సవరణ చేయడం దుర్మార్గమని విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ లాంటి రాజ్యాంగ సంస్థలను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి నక్కల జంగయ్య, నాయకులు శ్రీశైలం, రఘురాం, రుక్కయ్య, రఘు, మధు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
21 నుంచి అరుదైన నాణేలు, కరెన్సీ ప్రదర్శన
చార్మినార్: ఈ నెల 21, 22, 23 తేదీల్లో పాతబస్తీలోని ఉర్దూ ఘర్‌లో అరుదైన అంతర్జాతీయ నాణేలు, కరెన్సీ నోట్లు, పురాతన వస్తువుల ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు సందర్శకులకు ప్రవేశం ఉచితమని పేర్కొన్నారు. అరుదైన నాణేలు, పేపర్ కరెన్సీ, స్టాంపులు, పెయింటింగ్‌ల ప్రదర్శన చరిత్రపై ఆసక్తి ఉన్నవారికి ఈ ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే ఈ అంతర్జాతీయ నాణేలు, కరెన్సీ ఎగ్జిబిషన్ అందరికీ అందుబాటులో ఉంటుందని.. తమకు కావాల్సిన వాటిని ఖరీదు చేయవచ్చని, అలాగే తమ వద్ద ఉన్న పురాతన నాణేలను విక్రయించవచ్చని సొసైటీ కార్యదర్శి డాక్టర్ సయ్యద్ అబ్దుల్ హై ఖాద్రీ తెలిపారు. నాణేలు, పేపర్ కరెన్సీ, స్టాంపులు, పెయింటింగ్‌లతో పాటు ఇతర పురాతన వస్తువుల మిశ్రమ కలయిక వస్తువులను ఎగ్జిబిషన్‌లో సందర్శకులకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు.

మామిడి రైతుల ప్రయోజనాలే ముఖ్యం