మిత్ర ఒక ప్రముఖ ఎంఎన్‌సీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తన పనితీరుతో రెండేళ్లలోనే టీమ్ లీడర్‌గా, నాలుగేళ్లలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఎదిగాడు. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. ప్రతి ప్రాజెక్ట్ గురించీ ఒకటికి పదిసార్లు ఆలోచించేవాడు. పదే పదే మీటింగ్‌లు పెట్టేవాడు. కానీ ఏ నిర్ణయమూ తీసుకునేవాడు కాదు. దాంతో ప్రాజెక్టులు ఆలస్యమయ్యేవి. దీంతో మేనేజ్‌మెంట్ అతని పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేయసాగింది. ఆలోచనల నుంచి తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా మిత్రకు సాద్యం కావడంలేదు. ఆఖరుకు కాఫీ తాగాలా, టీ తాగాలా అనే విషయం మీద కూడా అతిగా ఆలోచించడం అతనికే చిరాకు కలిగిస్తోంది.
మిత్రలా అతిగా ఆలోచించడం ఎవరినైనా ఇబ్బంది పెడుతుంది ఎప్పుడో ఒకసారి! ఆ సమయంలో ఎంత ప్రయత్నించినా మనసు చేసే ఆ అతి వాగుడును ఆపలేం. అది అప్పుడప్పుడయితే ఫర్వాలేదు. కానీ అది అలవాటుగా మారితేనే సమస్య. ఆ అతి ఆలోచన.. పనులకు అడ్డుపడుతుంది, మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఇంకా చాలారకాలుగా చికాకు పెడుతుంది.
ఎందుకలా ఆలోచిస్తారు?
అతిగా ఆలోచించడానికి అనేక కారణాలున్నాయి. అందులో ప్రధానమైనవి.. తప్పులు చేయకూడదనే భయం, అన్నీ పర్ఫెక్ట్‌గా చేయాలనే తపన, ఆత్మవిశ్వాసం లోపించడం. ఇంకా ఆందోళన (యాంగ్జయిటీ), ఆత్మగౌరవలోపం (లో సెల్ఫ్ ఎస్టీమ్), గతకాలపు గాయాలు కూడా.ప్రాక్టికాలిటీకి అతీతంగా ఉన్నత ప్రమాణాలను సెట్ చేసుకున్నప్పుడు ప్రతి నిర్ణయం ఒత్తిడికి కారణమవుతుంది.
అది ఎప్పటికీ అంతంకాని ఆలోచనలతో అనాలసిస్ పెరాలసిస్‌కు కారణమవుతుంది. మిత్ర చేస్తున్న తప్పు ఇదే. తప్పులు చేయకూడదనే, ఫెయిల్యూర్ కాకూడదనే భయమే మిత్ర ఎక్కువగా ఆలోచించడానికి కారణం. అలాగే ప్రతికూల ఫలితాలు వస్తాయేమోననే ఆందోళనా అతను అతిగా ఆలోచించేలా చేస్తోంది. ఆత్మవిశ్వాసం లోపించించడం, ఆత్మగౌరవం తగ్గడం అతిగా ఆలోచించడానికి ఆజ్యం పోస్తుంది. తన సామర్థ్యం, నిర్ణయాలను సందేహిస్తూ అతిగా ఆలోచించేలా చేస్తాయి.
ఆందోళన చెందేటప్పుడు మన చింతలను నియంత్రించుకునేందుకు కొంచెం అతిగా ఆలోచించడం సహజం. కానీ అది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. గతంలో తీవ్రమైన.. బాధాకరమైన అనుభవాలకు లోనైనవారు దానికి సంబంధించిన మానసిక వ్యథను ఎదుర్కోవడానికి అతిగా ఆలోచిస్తుంటారు.
నష్టాలు.. కష్టాలు..
ఎవరైనా చెవి పక్కన చేరి నసపెడుతుంటే మీరు భోజనాన్ని ఎంజాయ్ చేయగలరా? అతిగా ఆలోచించడం కూడా అలాంటిదే. అది మనసుకు మాత్రమే పరిమితం కాదు. జీవితంలోని ప్రతి అంశాన్నీ ప్రభావితం చేస్తుంది. నిరంతరం నెగెటివ్‌గా ఆలోచించడం మన ఎమోషనల్ వెల్–బీయింగ్‌ను దెబ్బతీస్తుంది. మన శక్తిని హరించివేస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌కు కారణమవుతుంది.
గత సంఘటనలకు సంబంధించిన ఆలోచనలు, విశ్లేషణలు పదే పదే మనసులో పరుగెడుతున్నప్పుడు, భవిష్యత్తు గురించి పదే పదే భయపడుతున్నప్పుడు చేతిలో ఉన్న పనిపై లేదా చదువుపై దృష్టిపెట్టడం కష్టం. దాంతో వాయిదా వేస్తారు. అలా అలా చదువులు రోడ్డున పడతాయి. ఉద్యోగం అటకెక్కుతుంది. వ్యాపారం నష్టాల పాలవుతుంది. మానవ సంబంధాలూ దెబ్బతింటాయి.
విముక్తి పొందడం ఇలా..
మిత్రలా అతిగా ఆలోచించేవారు అతనిలాగే బాధపడాల్సిన అవసరం లేదు. ఆలోచనలపై నియంత్రణ సాధించేందుకు చేయగలిగేవి చాలా ఉన్నాయి. అంకితభావంతో ప్రయత్నిస్తే మనసులోని చాటర్ బాక్స్ నోరు మూయించవచ్చు. మితిమీరిన ఆలోచనలు మనసును కమ్మేసినప్పుడు మీరు నెగెటివ్ ట్రాప్‌లో పడ్డారని గుర్తించండి. ఇదే మీరు వేయాల్సిన తొలి అడుగు. ఆ తర్వాత నెగెటివ్ ఆలోచనలను సవాలు చేయండి. వాటిలో వాస్తవావాస్తవాలను విశ్లేషించండి.
ఆలోచిస్తూ ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని గుర్తించి, వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకుని అడుగు వేయండి. మనసును ఇబ్బంది పెడుతున్న పని లేదా చదువులకు దూరంగా ఉండండి. మనసుకు ఆహ్లాదం లేదా విశ్రాంతి కలిగించే కార్యకలాపాలలో పాల్గొనండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ప్రతి రాత్రి 7–8 గంటలనిద్రను లక్ష్యంగా పెట్టుకోండి.
మీ ఆందోళనల గురించి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడండి. శ్వాసను లేదా ఆలోచనలను గమనించడం, ధ్యానం ద్వారా మనసును మళ్లించవచ్చు. ఇవన్నీ చేసినా ఆలోచనలు తగ్గకపోతే ఆలస్యం చేయకుండా సైకాలజిస్టును కలవండి.కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలోని కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ ద్వారా సైకాలజిస్ట్ మీకు సహాయపడగలరు.
దీని ద్వారా అతిగా ఆలోచించడానికి ఆజ్యం పోసే కాగ్నిటివ్ డిస్టార్షన్స్‌ను గుర్తించవచ్చు, వాటిని సవాలు చేసి మరింత వాస్తవిక, సానుకూల ఆలోచనలతో భర్తీ చేయవచ్చు. దీనివల్ల చీకటి నుంచి కాంతికి మారినట్లు మనం విషయాలను మరింత స్పష్టంగా చూడగలం.
సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com
Comments
Please login to add a commentAdd a comment