ఆ మాజీమంత్రి ఓ నియోజకవర్గానికి వలస నేత. అయినా పచ్చ పార్టీ బాస్ ఆదేశాల మేరకు అక్కడి కేడర్ వలస నేతను నెత్తిన పెట్టుకున్నారు. అయితే రెండు సార్లు గెలిపించినా.. మూడో సారి ఓడేసరికి కేడర్‌ను పట్టించుకోవడంలేదట ఆ వలస నాయకుడు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈయన మాకొద్దంటూ అక్కడి కార్యకర్తలు బాస్‌కు తేల్చి చెప్పేశారట. లోకల్, నాన్ లోకల్ పంచాయతీ పచ్చ పార్టీ బాస్‌కు తలనొప్పిగా మారిందట.
పేరుకే సీనియర్
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా చెప్పుకునే దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇప్పుడు మైలవరం తమ్ముళ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారట. గత కొంత కాలంగా ఉమాతో టచ్ మీ నాట్ అనేలా వ్యవహరిస్తున్న క్యాడర్ ఇప్పుడు ఏకంగా ఆయనకు వ్యతిరేకంగా ఓ కూటమిని ఏర్పాటు చేసుకోవడమే ఇందుకు కారణమని టాక్. నియోజకవర్గాల పునర్విభజనలో నందిగామ నియోజకవర్గానికి చెందిన దేవినేని ఉమ... మైలవరంకు మారాల్సి వచ్చింది.
పట్టించుకోకపోతే దించేస్తాం
కొత్త నియోజకవర్గంలో సామాజికవర్గ సమీకరణాలు బాగా కలిసిరావడంతో స్థానికేతరుడే అయినప్పటికీ పార్టీ క్యాడర్, ప్రజలు ఉమాకు పట్టం కట్టారు. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిపించి అసెంబ్లీకి పంపించారు. ఇంత వరకూ బాగానే ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో కొంత కాలంగా దేవినేని ఉమ క్యాడర్ ను అసలు పట్టించుకోవడంలేదట. ఎక్కడా కలుపుకెళ్లకపోవడంతో మైలవరం తమ్ముళ్ళు ఉమాపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఉమా వైఖరితో విసిగిపోయిన క్యాడర్, ఆయన కారణంగా నష్టపోయిన నేతలు ఉమాకు వ్యతిరేకంగా ఓ టీమ్ ను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారట.
తెరపైకి బొమ్మ
తమ మధ్య ఉంటూ తమకోసం పనిచేసే నాయకుడు, తమ నియోజకవర్గానికి చెందిన నేత కావాలంటూ మైలవరం కేడర్ తమ పార్టీ బాస్‌ను డిమాండ్ చేస్తున్నారట. లోకల్, నాన్ లోకల్ అంశం తెరపైకి రావడంతో పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచనలో పడ్డట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఉమాతో నిమిత్తం లేకుండా బొమ్మసాని సుబ్బారావు నాయకత్వంలో పనిచేయాలని గొల్లపూడిలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మైలవరంకు చెందిన నేతలు, కార్యకర్తలు ఓ నిర్ణయానికి వచ్చేశారని తెలుస్తోంది. దేవినేని ఉమా ఫోటో కూడా లేకుండా ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సమావేశం వేదికగా 2024లో మైలవరం టిక్కెట్టు బొమ్మసానికి ఇస్తేనే పార్టీ కోసం పనిచేస్తామని, అభ్యర్థిని గెలిపిస్తామని నాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం.
నాటి కుట్ర.. నేడు మెడకు.!
స్థానికత అంశాన్ని తెరమీదకు తెస్తూ మైలవరం టీడీపీ శ్రేణులు ఏకం కావడం పార్టీ అధిష్టానానికి, దేవినేని ఉమాకు షాకిచ్చిందట. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మైలవరం టీడీపీలో లోకల్ నినాదం తెరపైకి రావడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయన్న టాక్ నడుస్తోంది. 2014 ఎన్నికల్లో మైలవరం వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన జోగిరమేష్‌ను దెబ్బ కొట్టడానికి అప్పుడు వైసీపీలో ఉన్న బొమ్మసాని సుబ్బారావును దేవినేని ఉమా ఇండిపెండెంట్ గా బరిలోకి దించాడు . తన గెలుపునకు సహకరిస్తే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం, పదవులు కట్టబెడతానని మాటిచ్చాడు. 2014 ఎన్నికల్లో దేవినేని విజయం సాధించడం మంత్రి అవ్వడం చకచకా జరిగిపోయాయి. కట్ చేస్తే గెలిచిన తర్వాత దేవినేని విజయానికి కారణమైన బొమ్మసానిని పట్టించుకోవడం మానేశాడట. కాలం కలిసిరాలేదని ఊరుకున్న బొమ్మసాని..2024 మైలవరంలో టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగాలని ఆరాటపడుతున్నారని సమాచారం. అందులో భాగంగానే ఆత్మీయ సమావేశం పెట్టుకుని తనకు జరిగిన అన్యాయాన్ని బొమ్మసాని బయపెట్టేశారని చర్చ నడుస్తోంది.
ఎసరు పెట్టేందుకు నాని రెడీ
ఇదంతా పైకి కనిపించే విషయాలే కాగా...అసలు స్థానికత తెరమీదకు రావడం వెనుక ఎంపీ కేశినేని నాని హస్తం కూడా ఉందన్న ప్రచారం మైలవరంలో జోరుగా సాగుతోంది. కేశినేని నాని అంటే దేవినేని ఉమాకు పడదు. ఈ ఇద్దరు నేతలూ ఎప్పుడూ ఎడమొహం పెడమొహంగానే ఉంటారు. ఇటీవల టీడీపీలో కేశినేని నాని సోదరుడు చిన్ని యాక్టివ్ రోల్ పోషించడానికి దేవినేని ఉమానే కారణమట. నానిపై ఉన్న కోపంతో చిన్నిని చంద్రబాబు సాయంతో బెజవాడ రాజకీయాల్లో బిజీ చేసేశారట దేవినేని ఉమ. ఈ విషయంపై గత కొంత కాలంగా రగిలిపోతున్న కేశినేని నాని...సమయం చూసి ఇప్పుడు మైలవరంలో దేవినేనికి ఎసరు పెట్టేందుకు వేగంగా పావులు కదుపుతున్నారని వినికిడి. అందుకే బొమ్మసాని రూపంలో లోకల్ నినాదాన్ని రాజేసినట్లు టాక్.
బాబు బంతాట
బొమ్మసాని సుబ్బారావుకి కేశినేని నాని సన్నిహితుడైన కాజ రాజ్ కుమార్ బహిరంగంగానే మద్దతిస్తున్నారు. అందుకే ఉమాకు ఇప్పుడు అసలైన టెన్షన్ మొదలైందట. మైలవరం నియోజకవర్గం అంతటా...బొమ్మసాని సుబ్బారావుకి, కాజ రాజ్ కుమార్ కు టీడీపీ క్యాడర్ లో మంచి పట్టు ఉండటంతో ఉమాకు దిక్కు తోచడంలేదని తెలుగు తమ్ముళ్ళు సంతోషంగా చెబుతున్నారు. మైలవరం ఆత్మీయ సమావేశం వేదికగా ఉమాపై వెల్లువెత్తిన అసమ్మతిపై ఇప్పటికే చంద్రబాబు ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారని తెలుస్తోంది. మైలవరంలో తలెత్తిన లోకల్, నాన్ లోకల్ పంచాయతీలో అధిష్టానం ఎవరివైపు నిలబడుతుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారట.
Comments
Please login to add a commentAdd a comment