సంగారెడ్డి: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జిల్లా అధికార యంత్రాంగం సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతిష్టాత్మక పథకాలను వీలైనంత త్వరగా లబ్ధిదారుల చెంతకు చేరేలా చర్యలు చేపట్టింది. ప్రధానంగా గొర్రెల పంపిణీ, దళితబంధు వంటి పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
జిల్లాలో తొలి విడతలో 18,754 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. అయితే రెండో విడతలో 10,331 మందికి ఈ యూనిట్లను అందించాల్సి ఉండగా, ఈ పంపిణీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్బంగా ఈ యూనిట్లను పంపిణీ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ, గొర్రెలు కొనుగోళ్లు ఆలస్యం కావడంతో ఈ పంపిణీ ప్రక్రియ ముందుకు సాగలేదు.
ప్రొక్యూర్‌మెంట్ టీంలు గొర్రెలను కొనుగోలు చేసేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పటికీ వాటిని ఇక్కడికి తేవడంలో జాప్యం జరుగుతోంది. దీంతో సుమారు 10 వేల యూనిట్లు పంపిణీ చేయాలని భావించినప్పటికీ ఇప్పటి వరకు కేవలం 342 యూనిట్లు మాత్రమే పంపిణీ చేయగలిగారు. ఇటీవల జిల్లా కేంద్రంలో కొందరు లబ్ధిదారులకు ఈ యూనిట్లకు సంబంధించిన గొర్రెలను ఇచ్చారు.
దళితబంధు జాబితా వెరిఫికేషన్..
ప్రతిష్టాత్మక పథకాల్లో ప్రధానమైన దళితబంధు పథకం రెండో విడత అమలు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన లబ్ధిదారుల జాబితాను అధికారులు వెరిఫికేషన్ చేస్తున్నారు. తొలి విడతలో నియోజకవర్గానికి వంద చొప్పున దళితబంధు లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు.
ఈ యూనిట్లు ఇప్పటికే గ్రౌండింగ్ పూర్తయింది. అయితే తొలి విడతలో నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి సాచ్యూరేషన్ పద్ధతిన ఆ గ్రామంలోని దళితులందరికి ఈ పథకం కింద యూనిట్లను మంజూరు చేసిన విషయం విదితమే. ఇప్పుడు నియోజకవర్గానికి 1,100 చొప్పున యూనిట్లు మంజూరయ్యాయి.
ఈ మేరకు ఆయా నియోజకవర్గాల నుంచి లబ్ధిదారుల జాబితాలను అందజేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నుంచి లబ్ధిదారుల జాబితాలు కలెక్టరేట్‌కు రాగా, ఒక్క జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఈ జాబితా రావాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో ఇది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కాగా నారాయణఖేడ్, ఆందోల్ నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలు మెదక్ జిల్లా పరిధిలో ఉండటంతో ఆయా మండలాల జాబితాలు మెదక్ జిల్లా కలెక్టరేట్‌కు పంపుతున్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే దళితబంధు యూనిట్లను మంజూరు చేసేందుకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కలెక్టర్ సమీక్షలు
ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలపై కలెక్టర్ శరత్ తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు, సన్నాహాలు చేస్తూనే.. మరోవైపు ఈ సంక్షేమ పథకాల అమలు తీరుపై సంబంధిత శాఖ అధికారులు, మండలాల్లోని సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు.
దళితబంధు, గొర్రెల పంపిణీ పథకం అమలుపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేసిన కలెక్టర్.. ఈ రెండు పథకాల అమలును వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద ఎన్నికల కోడ్ వచ్చేలోగా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment