నీలం మధు ముదిరాజ్, కాట శ్రీనివాస్ గౌడ్, గాలి అనిల్ కుమార్
సాక్షి, మెదక్: పటాన్‌చెరు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు. కాటా శ్రీనివాస్ గౌడ్, గాలి అనిల్ కుమార్, నీలం మధు మధ్య పోటీ నెలకొంది. కాటా శ్రీనివాస్ గౌడ్‌కు టికెట్ వస్తుందని భావించినప్పటికీ, తెరపైకి అనూహ్యంగా నీలం మధు వచ్చారు. బీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి బీఫారం అందుకున్నారు. కొన్ని వారాల క్రితమే మహిపాల్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. కానీ బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనేది ఇంకా స్పష్టం కాలేదు.
కాంగ్రెస్ తొలి విడత అభ్యర్థుల జాబితాను ఆదివారం వెలువరించింది. అందులో కాంగ్రెస్ పటాన్‌చెరు అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు. దీంతో ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ నుంచి మొత్తం ఎనిమిది మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. కాట శ్రీనివాస్‌గౌడ్ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆయనకే టికెట్ దక్కుతుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. దరఖాస్తులు పెట్టుకున్న వారిలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు మనోహర్ రెడ్డి, అమీన్‌పూర్ సర్పంచ్ శశికళ యాదవ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సపన్‌దేవ్, గాలి అనిల్ కుమార్ ప్రధానంగా ఉన్నారు.
కాట శ్రీనివాస్ గౌడ్‌కు టికెట్ ఇప్పించేందుకు మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత ఒకరు నీలం మధుకు టిక్కెట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. నీలం మధు కూడా తన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఒకవైపు కాంగ్రెస్‌లో ప్రయత్నం చేస్తూనే బీజేపీలో కూడా పైరవీ చేస్తున్నట్టు సమాచారం. ఆ విషయంలో ఆయనకు స్థానిక మాజీ ఎమ్మెల్యే సాయం చేస్తున్నారని తెలిసింది. అలాగే జగ్గారెడ్డి కూడా నీలం మధుకు మద్దతు ఇస్తున్నారని కాంగ్రెస్‌కు చెందిన పలువురు చెబుతున్నారు.
మాజీ మంత్రికి రూ.పది కోట్లు ఆఫర్!
కాటా శ్రీనివాస్ గౌడ్‌కు టికెట్ వస్తే మంచిదని అధికార పార్టీ భావిస్తోందనే ప్రచారం ఉంది. శ్రీనివాస్ గౌడ్‌కే టికెట్ ఇప్పించాలని ఓ బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధి తనకున్న కాంగ్రెస్ సంబంధాలను వినియోగిస్తున్నారని, అందు కోసం ఒక మాజీ మంత్రికి రూ.పది కోట్లు ఆఫర్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ పుకార్లను పక్కన పెడితే రెండు దశబ్దాలుగా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్‌తోనే కొనసాగడం, రాహుల్ గాంధీ పాదయాత్రను విజయవంతం చేయడంతో తన వంతు కృషిచేయడం వంటి కార్యక్రమాల వల్ల ఆయనకే టికెట్ లభించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. పార్టీ ప్రాథమిక సభ్యత్వంలేని నీలం మధుకు కాంగ్రెస్‌లో అవకాశమే లేదని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు.
గాలి అనిల్ కూడా..
నర్సాపూర్‌లో పోటీ చేయాలని ఆశించిన గాలి అనిల్ కుమార్ అక్కడ మదన్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుసుకుని, పటాన్‌చెరులో తనకు పోటీచేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. మైనంపల్లి హన్మంతరావు, మదన్ రెడ్డితో చర్చలు జరిపిన తర్వాత నుంచి గాలి అనిల్‌కుమార్ పటాన్‌చెరు నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెబున్నాయి. నీలం మధు తన శిష్యుడని, తాను గెలుపు కోసం ఎంతైనా ఖర్చు చేస్తానని ఢిల్లీ నేతలను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment