కడ్తాల్: పర్యావరణ పరిరక్షణకు యువత నడుం బిగించాలని ప్రముఖ పర్యావరణవేత్త, రిటైర్డ్ ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి అన్నారు. మండల పరిధిలోని అన్మాస్‌పల్లి సమీపంలోని ఎర్త్ సెంటర్‌లో కౌన్సిల్‌ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణసంస్థ ఆధ్వర్యంలో శనివారం ‘వాతావరణ భద్రత– యువత పాత్ర’ అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సుకు పురుషోత్తంరెడ్డితోపాటు సీజీఆర్ చైర్‌పర్సన్ లీలా లక్ష్మారెడ్డి, పర్యావరణ నిపుణుడు దొంతి నర్సింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. యువత పర్యావరణ రక్షణకు నాయకత్వం వహిస్తూ, ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని.. సమాజంలో సుస్థిర అభివృద్ధికి వారధిగా నిలవాలని పిలుపునిచ్చారు. సీజీఆర్ చైర్ పర్సన్ లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ రక్షణతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములయ్యేందుకు యువత కదిలి రావాలని కోరారు. పర్యావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి తదితర ప్రాధాన్యత అంశాలపై దొంతి నర్సింహారెడ్డి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీజీఆర్ వ్యవస్థాపకుడు లక్ష్మారెడ్డి, ఎర్త్‌సెంటర్ డైరెక్టర్ డాక్టర్ సాయిభాస్కర్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ విజయ్‌భాస్కర్‌రెడ్డి, వందేమాతరం ఫౌండేషన్ చైర్మన్ మాధవరెడ్డి, గౌతమిఫౌండేషన్ అధ్యక్షుడు కృష్ణ, అయిష్టర్ సంస్థ అధ్యక్షుడు సునీల్ శింగాడే, పర్యావరణ ప్రచారకర్త సురేశ్, సామాజిక కార్యకర్త రుచిత్ కమల్, వికాస్, వివిధ కళాశాలల ప్రొఫెసర్లు, ఎన్‌ఎస్‌ఎస్ ఇన్‌చార్జిలు, లీప్ ఎడ్యుకేషన్ సెంటర్స్ నిర్వాహకులు, సీజీఆర్ ప్రతినిధులు, వివిధ కళాశాలల విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు.