
పతంగులు, మాంజా కొనుగోళ్లు
గాలిపటం ఎగురవేయడానికి వినియోగించే నిషేధిత చైనా మాంజా ప్రమాదకరంగా మారింది. ఎగురవేసే వారి చేతి వేళ్లు తెగి గాయాలవుతుంటాయి. అంతేకాకుండా రహదారులపై రాకపోకలు సాగిస్తున్నవారి మెడకు తగిలి గొంతు దగ్గర గాయాలయ్యే ప్రమాదం ఉంది. పతంగులు ఎగురవేసేందుకు నిషేధిత మాంజాను ఉపయోగించకపోవడమే మంచిది. ఎక్కువ మంది పిల్లలు ఈ మాంజానే ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతుండటంతో మార్కెట్లో విచ్ఛలవిడిగా లభిస్తుంది. సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు చేపట్టడం లేదు. ప్రకటనలు జారీచేసి చేతులు దులుపుకోవడంతో వ్యాపారులు యథేచ్చగా విక్రయిస్తున్నారు. గాలిపటాలు ఎగురవేస్తున్నప్పుడు ఒక్కోసారి మాంజా తెగి చెట్లు, కరెంటు వైర్లు, భవనాలకు చిక్కుకొని పక్షులకు ప్రాణాంతకంగా మారింది.
తెగిన మాంజా కోసం..
విద్యుత్ స్తంభాలకు చిక్కుకున్న తెగిన మాంజా, పతంగులను చేతులు, ఇనుప చువ్వలతో తీసే ప్రయత్నం చేయకూడదు. విద్యుదాఘాతానికి గురయ్యే అవకాశం ఉంది. విద్యుత్ తీగలపై పడిన దారాలు పట్టుకుని లాగకూడదు, ఇలా చేస్తే విద్యుత్ సరఫరా జరుగుతున్న తీగలు ఒకదానికొకటి తాకి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలబారిన పడకుండా ఉంటారు.
తగిన జాగ్రత్తలతో..
పట్టణాలు, గ్రామాల్లో పిల్లలు ఇళ్లపైన పతంగులను ఎగురవేస్తుంటారు. పట్టణాల్లో మైదానాలు దూరంగా ఉంటాయి. దీంతో పిల్లలు భవనాలు ఎక్కి పతంగులు ఎగురవేస్తుంటారు. భవనాలకు పిట్ట గోడలు లేకపోవడం, ఉన్నా తక్కువ ఎత్తులో ఉండటంతో ఎగురవేసే ఆనందంలో ఇవి చూడరు. దీంతో కిందపడే అవకాశం ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకుని పతంగులను ఎగురవేయాలి. తెగిన గాలిపటం కోసం వెనుకా ముందు చూడకుండా వాటి వెనుక పరుగెత్త కూడదు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. గాలిపటాలను ఆరు బయట, మైదాన ప్రాంతాల్లోనే ఎగురవేయాలి. పతంగులను ఎగురవేస్తున్న పిల్లలను పెద్దలు ఓ కంట కనిపెడుతూ ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment